నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు జిల్లాకు చేరుకోనున్న మంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి టెంపుల్ సిటీ, చిన్నతండా, సూర్యనగర్, 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత ములుగు జిల్లా మేడారంలో అభివృద్ధి పనులకు పరిశీలనకు మంత్రి బయలుదేరతారు.
శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరిపించారు. ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో చేరిన ఆర్‌టీఓ
ఖమ్మంక్రైం: రెండు నెలల పాటు శిక్షణ నిమిత్తం వెళ్లిన జిల్లా రవాణాశాఖాధికారి జగదీష్ శనివారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని రవాణా శాఖాధికారులతో సమావేశం అయ్యారు. ఇటీవల కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడులపై ఆరాతీయడమే కాక, పెనుబల్లి మండలంలో శుక్రవారం స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన వివరాలు తెలుసుకున్నారు. స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీలో పాటిస్తున్న నిబంధనలు తెలుసుకున్న ఆర్‌టీఓ, సంబంధిత ఫైల్‌ను పరిశీలించినట్లు తెలిసింది.
నర్సింగ్ కళాశాలకు స్థలాల పరిశీలన
చింతకాని: చింతకాని మండలానికి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కేటాయిస్తూ భవన నిర్మాణాల కోసం రూ.29కోట్లు విడుదల చేస్తూ గతనెల 29న ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈమేరకు భవన నిర్మాణాలకు అనువైన స్థలాలను టీజీఎంఎస్‌ఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటకృష్ణ శనివారం పరిశీలించారు. మండలంలోని లచ్చగూడెం, నాగులవంచ రైల్వేకాలనీ, తిమ్మినేనిపాలెం, సీతంపేట గ్రామాల్లో స్థలాలను పరిశీలించిన ఆయన పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. టీజీఎంఎస్‌ఐడీసీ ఏఈ జమలయ్య, తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఆర్‌ఐ జగదీష్, సర్వేయర్ నవీన్ పాల్గొన్నారు.
సీఎం కప్ క్రీడాపోటీలకు దరఖాస్తులు
ఖమ్మం స్పోర్ట్స్: సీఎం కప్ క్రీడాపోటీల్లో పాల్గొ నే క్రీడాకారులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి సూచించారు. క్రీడాకారులే కాక పీఈటీ, పీడీలతో పాటు క్రీడా సంఘాల బాధ్యులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వివరాల కోసం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ప్రారంభమైన టెట్
ఖమ్మం సహకారనగర్: టీచర్ ఎలిజబులిటీ టెస్టు(టెట్) శనివారం నుంచి ప్రారంభమైంది. పరీక్షల నిర్వహణకు జిల్లాలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు డీఈఓ చైతన్య జైనీ తెలి పారు. తొలిరోజు సెషన్–1కి 1,760మందిలో 1,631మంది, సెషన్–2కి 1,760లో 1,615మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు.
ఎల్‌ఐజీ ఫ్లాట్లకు 8వరకు దరఖాస్తులు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం శ్రీరాంనగర్‌లో నిర్మించిన ఎల్‌ఐజీ ఫ్లాట్ల కోసం 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. అల్పాదాయ వర్గాల కోసం హౌసింగ్ బోర్డు, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన అపార్ట్‌మెంట్లలో అమ్మకానికి తొలుత ప్రకటించిన దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. అయితే, పలువురి వినతితో 8వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఫ్లాట్ల కేటాయింపునకు లాటరీ మాత్రం ఈనెల 10వ తేదీనే జరుగుతుందని తెలిపారు.


