ప్రభుత్వ భవనాల్లోనే కార్యాలయాలు
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగేలా తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. చింతకాని మండలంలోని రేపల్లెవాడ, రైల్వే కాలనీ, రాఘవపురం, నర్సింహాపురం పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించి, కార్యాలయాల నిర్మాణం జరిగే వరకు జనరల్ ఫండ్ ద్వారా అద్దె చెల్లించాలని సూచించారు. అలాగే, కామేపల్లిలోని సీడీపీఓ కార్యాలయాన్ని పండితాపురం కమిటీ హాల్‌లోకి, ఖమ్మం అర్బన్ కార్యాలయాన్ని చిల్డ్రన్ హోమ్స్ వద్ద భవనంలోకి మార్చాలని తెలిపారు. అంతేకాక తిరుమలాయపాలెం సీడీపీఓ కార్యాలయానికి అనువైన భవనాన్ని ఎంపిక చేయాలని, ఖమ్మం రూరల్, మధిర, సత్తుపల్లి సీడీపీఓ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని స్పష్టం చేశారు. అలాగే, టీఎస్ జీఎల్‌ఐ కార్యాలయాన్ని పాత మున్సిపాలిటీ కార్యాలయంలోకి మార్చాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు జ్యోతి, శ్రీనివాసాచారి, యాకూబ్, నాగేందర్‌రెడ్డి, పుల్లయ్య, అలీమ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


