గజ.. గజ వణుకు
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
మధ్యాహ్నం వేళ కూడా
కనిష్ట ఉష్ణోగ్రతలే
ఉదయం పొద్దెక్కే వరకు
పొగమంచు ప్రభావం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాను చలి వణికిస్తోంది. గత మూడు వారాలుగా చలి తీవ్రత పెరగడంతో జనజీవనంపై ప్రభావం పడింది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి ఉదయం పొద్దెక్కేవరకు పొగమంచు తెరలు వీడడం లేదు. దీంతో రోజువారీ కార్యకలాపాలకు ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరో ఐదారు రోజుల వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది చలి పంజా..
గతంతో పోలిస్తే ఈ ఏడాది చలి పంజా విసురుతోంది. అటవీ ప్రాంతాలు, గ్రామాలే కాకుండా పట్టణాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. డిసెంబర్ నెలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 – 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రాత్రి సమయాన భూమి ఉపరితలం వేగంగా చల్ల బడడం వల్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలతోపాటు సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10గంటలు దాటే వరకు మంచుప్రభావం తగ్గకపోవడంతో రహదారులపై ప్రయాణం ఇబ్బందిగా సాగుతోంది.
జనవరిలోనూ తీవ్రమే..
సహజంగా జనవరిలో చలి తగ్గి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుంటాయి. కానీ ఈసారి చలి అదే స్థాయిలో ఉంటోంది. చలికాలం ముగింపు దశకు చేరుతున్నా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటం విశేషం. ఈనెల ఇప్పటివరకు పగటి సమయంలోనూ చలి ప్రభావం ఉంటోంది. ఉదయం వేళ పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు స్వెట్టర్లు, మఫ్లర్లతో వస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చలిమంటలు వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
కమ్మేస్తున్న పొగమంచు
గతకొద్ది రోజులుగా పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. అర్ధరాత్రి మొదలు ఉదయం 10గంటల వరకు పొగమంచు తగ్గకపోవడంతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఉంటున్నాయి. ఫలితంగా వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. మంచు, చలి ప్రభావంతో పలువురు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. మరో ఐదారు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యాన శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని, వేడి ఆహారం, గోరువెచ్చటి నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గజ.. గజ వణుకు


