పన్నుపోటు
వసూలు కావాల్సింది రూ.15.55 కోట్లు సర్పంచ్ అభ్యర్థులు చెల్లించినా అంతంత మాత్రంగానే రాబడి
పంచాయతీలకు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో నూతనంగా కొలువుదీరిన గ్రామపంచాయతీ పాలకవర్గాలకు పన్నుల వసూలు సవాల్‌గా మారనుంది. సుదీర్ఘకాలం పాటు గ్రామపంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండడంతో అభివృద్ధి మందగించింది. ఇప్పుడు పాలకవర్గాలను ఎన్నుకోవడంతో పంచాయతీలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని గ్రామస్తులు ఆశిస్తున్నా పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండడంతో సందిగ్ధత నెలకొంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పన్ను తప్పక చెల్లించాలనే నిబంధన ఉండడంతో రాబడి ఉంటుందని అధికారులు భావించినా తక్కువ మొత్తంలోనే వసూలయ్యాయి. పాత, ప్రస్తుత బకాయిలు కలిపి జిల్లాలో రూ.15,55,82,207 ఉండగా.. రూ.5,69,69,816 మాత్రమే వసూలవడంతో, మిగతా బకాయిలపై కొత్త పాలకవర్గాలు దృష్టి సారిస్తేనే గ్రామాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి.
అస్తవ్యస్తంగా పల్లెలు
గత రెండేళ్లుగా పాలకవర్గాలు లేక గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పనులు నిలిచి పోయాయి. గత సర్పంచ్‌ల పదవీకాలం ముగిశాక ప్రత్యేక అధికారుల పాలనలో అత్యవసర పనులకే ప్రాధాన్యత ఇచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల వెంట చెత్త తొలగింపు, పైపులైన్ల లీకేజీలు, గ్రామాల్లో అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చడం వంటి ప్రాథమిక పనులు కూడా నిధులు లేక ఆగిపోయాయి. పంచాయతీ కార్యదర్శులు కొన్ని పనులకు సొంత నగదు వెచ్చించినా బిల్లులు రాలేదు.
కొత్త బకాయిలు రూ.14కోట్ల పైమాటే
ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడం, గ్రామాల్లో పన్నులు వసూలు కాకపోవడంతో గ్రామపంచాయతీల ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. జిల్లాలోని 571 జీపీల్లో పాతబకాయి రూ.1,29,69,091 ఉండగా.. ప్రస్తుత బకాయిలు రూ.14,26,13,116గా నమోదయ్యాయి. రెండేళ్లుగా పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగానే జరుగుతోంది. మొత్తం 20 మండలాల్లో నేలకొండపల్లి మండలంలో అత్యధికంగా రూ.1,39,28,115 బకాయి ఉంది. ఇందులో రూ.41,15,930 మాత్రమే వసూలయ్యాయి.
అభ్యర్థులు సరే...
ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పన్ను బకాయిలు ఉండొద్దనే నిబంధనతో చెల్లించారు. తద్వారా గ్రామపంచాయతీలకు మెరుగైన ఆదాయం నమోదవుతుందని భావించినా అంతగా ఫలితం కానరాలేదు. మొత్తం బకాయిల్లో పాతవి రూ.21,80,068, ప్రస్తుత బకాయిలు రూ.5,47,89,748 కలిపి రూ.5,69,69,816 గ్రామపంచాయతీల ఖజానాకు చేరాయి. ఇందులో పోటీ చేస్తున్న అభ్యర్థుల పన్నులతోపాటు ఇతరులు చెల్లించిన పన్నులు కూడా ఉన్నాయి. తద్వారా ఇంకా రూ.9,79,24,383 మేర పన్ను బకాయిలు అలాగే మిగిలిపోయాయి.
పేరుకుపోయిన పాత, కొత్త బకాయిలు


