ఎఫ్‌ఎల్‌ఎస్.. మరో విడత
సన్నద్ధతపై దృష్టి సారించాం..
● ఫిబ్రవరి, మార్చిలో నిర్వహణకు ఏర్పాట్లు ● విద్యార్థుల సామర్థ్యాల గుర్తింపునకు దోహదం ● తొలుత మూడు మాక్ టెస్ట్‌లు కూడా..
ఖమ్మంసహకారనగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానంలో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో రెండో విడత ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎస్) నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. మూడో తరగతి విద్యార్థుల్లో భాష, గణితం, సంఖ్యాజ్ఞానం సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడతారు. జిల్లాలో 814 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. ఇందులో 5,729 మంది చదువుతున్నారు. ఇప్పటికే మొదటి ఎఫ్‌ఎల్‌ఎస్ 2022 విద్యాసంవత్సరంలో పూర్తిచేశారు.
అంచనా వేసేలా..
జిల్లాలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎస్) 2022 విద్యాసంవత్సరం నుంచి అమలవుతోంది. అదే ఏడాది మొదటి విడత నిర్వహించగా, విద్యార్థుల్లో భాష(తెలుగు/ఉర్దూ), గణితంలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే విద్యార్థుల్లో సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ అధ్యయనం దోహదపడుతుందని చెబుతున్నారు.
అవగాహన కోసం
ప్రసుత్తం జిల్లా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ రెండో విడతకు సిద్ధం అవుతున్నారు. ఈ విడతలో అంచనా వేసే సామర్థ్యాల వివరాలు, ఏయే రంగాల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన కల్పించేలా విద్యాశాఖ, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి బుక్‌లెట్ రూపొందించింది.
సామర్థ్యాల అంచనా
తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూలో మౌఖిక భాషా గ్రహణశక్తి, ధ్వని సంబంధిత అవగాహన, చిహ్నం–ధ్వని సంబంధం, పఠన గ్రహణశక్తి (వాక్యం–చిత్రం సరిపోల్చడం), మౌఖిక పఠన సామర్థ్యాలు, గ్రహణశక్తి, రచన సామర్థ్యాలను అంచనా వేయడమే కాక గణితంలో సంఖ్యల గుర్తింపు, ఇతర అంశాలపై విద్యార్థుల్లో సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఇందుకోసం బుక్ బ్యాంక్ ఆధారంగా విద్యార్థులను సిద్ధం చేయడంతో పాటు, ఎఫ్‌ఎల్‌ఎస్ పూర్తయ్యాక విద్యాశాఖాధికారులు పలు కార్యక్రమాలు అమలు చేసే అవకాశముంది. అంతేకాక విద్యార్థుల స్థాయి అర్థమై ఉపాధ్యాయులు బోధనలో మార్పులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెబుతున్నారు. కాగా, ఎఫ్‌ఎల్‌ఎస్ అధ్యయనం రెండో విడతలో మెరుగైన ఫలితాలు నమోదయ్యేలా విద్యార్థులను మూడు భాషల్లో రూపొందించిన బుక్ బ్యాంక్ ఆధారంగా సిద్ధం చేస్తూ మూడు మాక్‌టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఇందుకోసం స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు.
ఎఫ్‌ఎల్‌ఎస్ కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించాం. ఇందుకోసం మౌఖిక భాషా సామర్థ్యాలపై మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తాం. గణితం, సంఖ్యాజ్ఞానంపై బుక్‌బ్యాంక్ ఆధారంగా రోజువారీ అభ్యాసం చేయించనున్నాం. ఇది విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.
– పెసర ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర రిసోర్స్ పర్సన్


