నరసింహావతార రూపుడై..
భద్రగిరిలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు
నృసింహసేవా వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర
మిథిలా వేదిక వద్ద బారులుదీరిన భక్తులు
భద్రాచలం: ప్రియ భక్తుడు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అనే రాక్షసుడి బారి నుంచి రక్షించేందుకు వెలిసిన నరసింహావతారంలో అలంకరించిన రామయ్యను దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు మంగళవారం నరసింహావతారంలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తులకు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను నృసింహావతారంలో అలంకరించి బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు చేశాక వేద పండితులు 200 పాశురాల ప్రంబంధాలను పఠించారు.
వైభవంగా శోభాయాత్ర..
ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం నృసింహసేవా వాహిని సభ్యులతో పాటు అహోబిల మఠానికి చెందిన కృష్ణ చైతన్య స్వామివార్లకు పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. నరసింహావతారంలో ఉన్న స్వామివారిని ప్రత్యేక పల్లకిపై కోలాట ప్రదర్శనలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియం వేదికపైకి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అర్చకులు అవతార విశిష్టతను వివరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తాతగుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు.
గ్రామ రక్షకుడిగా స్వామివారు..
గ్రామ రక్షణార్థం స్వామి వారు నరసింహావతారంలో పురవీధుల గూండా తిరువీధి సేవ కొనసాగడం ఈ అవతారం ప్రత్యేకత అని వేదపండితులు తెలిపారు. గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా, ఎలాంటి ఆపదలు కలగకుండా ఉండేందుకే నరసింహావతారంలో స్వామి వారు పురవీధులలో సంచరిస్తారని వివరించారు. ఆ తర్వాత తిరిగి అంతరాలయానికి తీసుకెళ్లారు.


