అంతర్జాతీయ సంస్థగా సింగరేణి
డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క,
సత్తుపల్లిలో ఏరియా జీఎం
కార్యాలయం ప్రారంభం
సత్తుపల్లి: ఇన్నాళ్లు తెలంగాణలో మాత్రమే బొగ్గు వెలికితీతకు పరిమితమైన సింగరేణి సంస్థ అనేక రంగాల్లోకి అడుగుపెడుతూ ప్రపంచ స్థాయికి ఎదుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. సత్తుపల్లిలో నిర్మించిన ఏరియా జీఎం కార్యాలయాన్ని మంగళవారం ఆయన సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్‌ను కట్ చేశాక సభలో మాట్లాడారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా సోలార్ ఎనర్జీ, మినరల్స్ రంగంలో అడుగు పెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌లను విక్రయిస్తున్నందున సాధ్యమైనన్ని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకునేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. జైపూర్‌లో 1,500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. సింగరేణి భవిష్యత్ కార్మికుల చేతుల్లో ఉందని గుర్తించి ఉత్పత్తి పెంచాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ సింగరేణి సంస్థ వల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతున్నప్పటికీ సైలో బంకర్ కారణంగా కిష్టారంలో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఈమేరకు సైలో బంకర్‌ను మార్చడంతో పాటు స్థానికులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలని కోరారు.
ఓసీ, సైలో బంకర్ పరిశీలన
జేవీఆర్ ఓపెన్‌కాస్టును సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్ నాయక్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. ఓపెన్‌కాస్టులో బొగ్గు తవ్వకాలు చేపడుతున్న తీరు, బొగ్గు నాణ్యత వివరాలు ఆరా తీశాక కిష్టారంలోని సైలో బంకర్‌ను పరిశీలించారు. ఆతర్వాత సత్తుపల్లి జీఎం కార్యాలయంలో సింగరేణి అధికారులతో పలు అంశాలపై భట్టి సమీక్షించారు.
విద్యుత్ వెతలు ఉండవు...
తల్లాడ: విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా అవాంతరాలు లేకుండా సరఫరా చేసేలా అవసరమైన చోట సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తల్లాడ మండలం పినపాక, అన్నారుగూడెం, కల్లూరు మండలం లింగాలల్లో రూ.10.53కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్‌స్షేన్లకు పినపాకలో ఆయన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నందునే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన 85 శాతం మందిని సర్పంచ్‌లుగా గెలిపించాలరని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, తిరుమలరావు, జీఎం చింతల శ్రీనివాస్, పీఓలు ప్రహ్లాద్, సునీల్‌కుమార్‌వర్మ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, జలనవరుల శాఖ ఎస్‌ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, యాకోబు, ఎం.వెంకటేశ్వర్లు, ఏసీపీ వసుంధర యాదవ్, ఉద్యోగులు, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, రాములు, సతీష్, కాపా సుధాకర్, జక్కంపూడి కిషోర్, కాపా అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.


