నేడు డిప్యూటీ సీఎం పర్యటన
మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం జిల్లాలో పర్యటించనున్నా రు. ఉదయం 10–30గంటలకు కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పథకాల పై ఆయన సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు బోనకల్ మండలంలోని ముష్టికుంట్లలో చిరునోముల వరకు రూ.3.45 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం మధిరకు చేరుకుని పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. అలాగే, మధిర 21వ వార్డు, బయ్యారం ఆర్‌సీఎం చర్చి లో రాత్రి జరగనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఇక గురువారం ఉదయం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా భట్టి పాల్గొననున్నారు.
కొనుగోలు కేంద్రాలు పరిశీలన
మధిర: మధిర వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏర్పాటుచేసిన పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీబాయి మంగళవారం పరిశీలించారు. అడిషనల్ డైరెక్టర్ పి.రవికుమార్, మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావుతో కలిసి మాటూరు క్రాస్‌లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం, మధిర మెయిన్ రోడ్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు భట్టు నాగమల్లేశ్వరరావు తదితరులను సన్మానించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీం, మార్కెట్ కార్యదర్శి కె.చంద్రశేఖర్, ఏఓ సాయిదీక్షిత్, ఏఈఓ అమృత పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల
విద్యార్థులకు కంటి పరీక్షలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి.రామారావు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 22నుంచి నిర్వహిస్తున్న కంటి పరీక్షలు జనవరి 31వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తద్వారా చూపు, దృష్టి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయడం వీలవుతుందన్నారు. రోజుకు 250–300మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలి పారు. ఈ కార్యక్రమాన్ని ఆప్తమాలజీ హెచ్‌ఓడీ డి.రామూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుమాధవరావు పర్యవేక్షిస్తారని వెల్లడించారు.
26న డాక్ అదాలత్
ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26వ తేదీన ఆన్‌లైన్ విధానంలో డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. కోర్టులో ఉన్న అంశాలు మినహా ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, సేవలు, పెండింగ్ అంశాల పై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఈమేర కు ఫిర్యాదులను 25వ తేదీలోగా ‘డాక్ అదాల త్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్, ఖమ్మం డివిజన్ – 507003’ చిరునామాకు పంపించాలని తెలిపారు. ఫిర్యాదుపై ఫోన్‌నంబర్ లేదా ఈ మెయిల్ పొందుపర్చాలని సూచించారు.
సమష్టి కృషితో
పశుసంపద అభివృద్ధి
రఘునాథపాలెం: ప్రభుత్వ కార్యక్రమాలకు తోడు ప్రజాప్రతినిధులు, దాతలు, సంఘాలు సహకరిస్తే పశుసంపద అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. గొర్రెలు, మేకల నట్టల నివారణ మందు పంపిణీని మంగళవారం ఆయన రఘునాథపాలెం మండలం వీవీపాలెంలో ప్రారంభించి మాట్లాడారు. నట్టల నివారణ మందు ద్వారా గొర్రెలు, మేకల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కాగా, సబ్‌సెంటర్‌లో పరికరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన నాగబండి రాంబాబు, కాపా భూచక్రం, కుతుంబాక రవీందర్‌ను ఆయన అభినందించారు. సర్పంచ్‌లు కె.ఆదినారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఎం. జ్యోతి, ఉయ్యూరు ద్రాక్షవతి, పశువైద్యాధికారి కె.క్రాంతికుమార్, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, సొసైటీ అధ్యక్షుడు లింగయ్య, సిబ్బంది టి.కృష్ణ, డీవీ.సత్యనారాయణ, సువర్చలదేవి, మణిదీప్ పాల్గొన్నారు.
నేడు డిప్యూటీ సీఎం పర్యటన


