ఆటోమేషన్‌లో సబ్‌స్టేషన్ల నిర్వహణ
● ‘రియల్ టైం మేనేజ్‌మెంట్’ విధానం అమలు ● ఎన్పీడీసీఎల్ పరిధిలోని 100 సబ్‌స్టేషన్లలో శ్రీకారం ● జానకీపురంలో ఆవిష్కరణకు సిద్ధం
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్వహణలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మానవ రహితంగా నిర్వహించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమేషన్ విధానం అమలుకు ఎన్పీడీసీఎల్(నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఆటోమేషన్ ఆఫ్ సబ్ స్టేషన్ల(స్వయం చలిత విద్యుత్ ఉప కేంద్రాలు) నిర్వహణ అమలవుతోంది. ఈ విధానాన్ని ఎన్పీడీసీఎల్ 33/11 కేవీ సబ్ స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించింది. సంస్థ పరిధిలోని 16 జిల్లాల్లో మొత్తం 1,516 సబ్ స్టేషన్లు ఉండగా తొలుత 100 సబ్ స్టేషన్లలో సరికొత్త విధానం అమలుకు రూ.26.32 కోట్లు వెచ్చిస్తున్నారు. తొలిదఫా జిల్లాలోని 38 సబ్ స్టేషన్లలో ఆటోమేషన్ విధానం అమల్లోకి రానుంది.
రియల్ టైం మేనేజ్‌మెంట్ విధానం
సబ్ స్టేషన్ల ఆటోమేషన్‌కు ‘రియల్ టైం ఫీడర్ మేనేజ్‌మెంట్ సిస్టం’ అమలు చేస్తారు. ఇందులో భాగంగా 11 కేవీ విద్యుత్ సరఫరా ఫీడర్ల ఆన్ – ఆఫ్‌ను ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ వ్యవస్థలతో అనుసంధానిస్తారు. తద్వారా సిబ్బంది అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా ఆపరేట్‌చేసే అవకాశం ఏర్పడుతుంది. సబ్ స్టేషన్‌కు సంబంధించి సరఫరా, అంతరాయాలు, ఇతర సాంకేతిక విషయాలను కంపెనీ హెడ్ క్వార్టర్‌లోని కంట్రోల్ రూమ్, సంబంధిత అధికారుల సెల్ ఫోన్లకు ఎప్పటికప్పుడు సమాచారం చేరుతుంది. తద్వారా ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే తక్షణమే తెలుసుకుని.. మరమ్మతు అనంతరం పునరుద్ధరించే అవకాశముంది. ఫలితంగా ఎక్కువ సేపు అంతరాయాలు ఉండకుండా, నాణ్యమైన విద్యుత్ అందుతుందని చెబుతున్నారు. నమ్మకమైన, నిజమైన సరఫరా వివరాలు తెలియనుండడంతో నెట్ వర్క్‌ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేసుకోవడం వీలవుతుంది.
జానకీపురంలో ఫస్ట్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని జానకీపురం సబ్ స్టేషన్‌లో ఆటోమేషన్ విధానాన్ని తొలిసారి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ విధానం అమలులో ఖమ్మం జిల్లాకు డిస్కం ప్రాధాన్యత ఇచ్చిందని, క్రమంగా నిర్దేశించిన 38 సబ్‌స్టేషన్లలో అమలు చేయనున్నామని ఖమ్మం ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మంగళవారం వెల్లడించారు.


