నిలకడ లేని మిర్చి ధర
దిగుబడి తగ్గొచ్చు...
● గత నెలతో పోలిస్తే క్వింటాకు రూ.వేయి డౌన్ ● ఎగుమతులు లేకపోవడమే కారణమంటున్న వ్యాపారులు ● నష్టానికి అమ్మలేక నిరాశలో రైతాంగం
మధిర: మిర్చి ధర కొద్దిరోజులు ఆశాజనకంగా ఉంటున్నా అంతలోనే తగ్గుతోంది. నిలకడ లేని ధరతో రైతులు పంట అమ్మలేక, కోల్డ్ స్టోరేజీలో అద్దె భారం మోయలేక కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే తేజ రకం మిర్చికి ఈసారి విదేశాల నుంచి ఆర్డర్లు లేకపోవడమే ధర పతనానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. మరోపక్క దిగుబడులు కూడా ఆశాజనకంగా లేకపోవడం, పంట చేతికొచ్చే సరికి ధర తగ్గుతుండడంతో రైతులు చేసేదేం లేక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేస్తున్నారు. ఇలా గత మూడేళ్లలో సాగైన మిర్చి ఇప్పటికీ కోల్డ్ స్టోరేజీలో మూలుగుతోంది. ప్రస్తుత ఏడాది పంట కూడా చేతికి వచ్చే సమయం సమీపించడంతో అప్పులు తీర్చేందుకు వ్యాపారులు చెప్పిన ధర అమ్మక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
పడిపోయిన సాగు విసీర్ణం
మిర్చిని ఆశిస్తున్న చీడపీడలు, పెరుగుతున్న సాగు వ్యయానికి తోడు ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు దృష్టి సారిస్తున్నా రు. గత ఏడాది జిల్లాలోని 69వేల ఎకరాల్లో మిర్చి సాగైతే ఈ ఏడాది కేవలం 32వేల ఎకరాలకే పరి మితం కావడం ఇందుకు నిదర్శనంగా నిలు స్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగయ్యే మిర్చి చైనా, బంగ్లాదేశ్, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి అవుతుంది. కానీ రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం పెరగడంతో పంట కొనుగోలుకు చేసేందుకు విదేశీ వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 40 లక్షల బస్తాలను నిల్వ చేసే సామర్థ్యంతో 42 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో ఇంకా 22 లక్షలు బస్తాల సరుకు నిల్వ ఉన్నట్లు అంచనా. మధిరలోని 13 కోల్డ్ స్టోరేజీల్లో గత మూడేళ్లలో పండిన పంట మొత్తంగా సుమారు ఆరు లక్షల బస్తాల సరుకు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది.
తగ్గనున్న దిగుబడులు
ఈ ఏడాది కూడా మిర్చి సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ముఖ్యంగా నల్లనల్లి, బొబ్బరోగం వంటి తెగుళ్లు ఆశించాయి. ఫలితంగా ఎకరాకు 7 – 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. సాగు విస్తీర్ణం పడిపోగా, తెగుళ్లతో దిగుబడి కూడా తగ్గనుండడంతో ధర పెరుగుతుందని ఆశించిన పలువురు గత ఏడాది పంటను మార్కెట్‌కు తీసుకొస్తే పరిస్థితులు విరుద్ధంగా ఉంటున్నాయి. గత నెలలో క్వింటా మిర్చికి జెండా పాట రూ.15,800 నమోదు కాగా ప్రస్తుతం రూ.14,800గా నమోదవుతోంది. క్వింటాకు నెలలోనే ధర రూ.వేయి తగ్గగా, కోల్డ్ స్టోరేజీ అద్దె, తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఈ ఏడాది మిర్చిని నల్ల తామర ఆశించడం వల్ల 25 – 30శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సుమారు నెల క్రితం మిర్చికి వేరుకుళ్లు వచ్చింది. దీంతో సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించాం. ఇటీవల పత్తి తీయగానే నల్ల తామర ఆశించింది.
– మధుసూదన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి
నిలకడ లేని మిర్చి ధర


