
మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల
● కొత్త చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంవన్‌టౌన్: మున్నేరు నదిలో ఎల్లవేళలా నీరు నిల్వ ఉండేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే కొత్త చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఖమ్మం నగరానికి తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయం శనివారం ఆయన మున్నేరు రక్షణ గోడ నిర్మాణ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమావేశమై భూసేకరణ, డిజైన్ తదితర అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్షణ గోడ నిర్మాణం అటు పాలేరు, ఇటు ఖమ్మం నియోజకవర్గాల్లో జరగనున్నందున.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా నిర్మించాలన్నారు. వీలైతే బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలని, భవిష్యత్‌లో వాల్ ఎత్తును పెంచడానికి ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. అంతేకాక వర్షాకాలంలో ఎంత వరద వచ్చినా నగరంలోకి బ్యాక్ వాటర్ చేరకుండా పటిష్టమైన డ్రెయినీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, నదిలో చెత్త వేయకుండా రెయిలింగ్ బిగించి, వైకుంఠధామం దగ్గర స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ప్రాజెక్ట్‌కు భూసేకరణ విషయంలో సమస్య తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని, తద్వారా కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, తిరుమలాయపాలెం జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.