TS: తొలిసారిగా కారు గుర్తుపై బరిలోకి... | Sakshi
Sakshi News home page

TS: తొలిసారిగా కారు గుర్తుపై బరిలోకి...

Published Sat, Nov 11 2023 12:08 AM

- - Sakshi

ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు తొలిసారిగా కారు గుర్తుపై బరిలోకి దిగుతున్నారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ గూటికి చేరగా.. సిట్టింగ్‌లకే టికెట్లు అన్న ప్రకటన మేరకు కేసీఆర్‌ బీఫామ్‌లు ఇచ్చారు. దీంతో తొలిసారిగా కారు గుర్తుపై పోటీ చేయనున్నారు.

► కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పలు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఒకసారి వైఎస్సార్‌సీపీ నుంచి, మిగతా అన్నిసార్లు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగి గెలిచాక బీఆర్‌ఎస్‌లో చేరారు. తొలిసారి కారు గుర్తుపై బరిలోకి దిగుతున్నారు.

► పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు 2009, 2018లో పినపాక అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఆయన ఈసారి అదే పార్టీ నుంచి కారు గుర్తు పై పోటీ చేస్తున్నారు.

► ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆమె గులాబీ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

► అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కూడా టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి ఎన్నికల్లో కారు గుర్తుపై తొలిసారి పోటీలో ఉన్నారు.

► సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలవగా, అనంతరం పరిణామాల్లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఆయన సైతం బీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి దిగుతున్నారు.

► పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ గూటికి చేరగా.. ఈసారి ఆయన సిట్టింగ్‌ కోటాలో బీఆర్‌ఎస్‌ బీఫామ్‌ దక్కించుకున్నారు.

► వైరా నుంచి లావుడ్యా రాములునాయక్‌ ఇండిపెండెంట్‌గా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయనకు ఈసారి టికెట్‌ దక్కలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా టికెట్‌ అందుకున్న బానోతు మదన్‌లాల్‌ తరఫున ప్రచారంలో నిమగ్నమయ్యారు.

పినపాక నుంచి గత ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్‌ తరఫున, పాయం వెంకటేశ్వర్లు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేశారు. ఈసారి మారిన పరిణామాల నేపథ్యాన వారిద్దరి కండువాలు తారుమారు కాగా.. మళ్లీ ప్రత్యర్థులుగానే బరిలో ఉన్నారు.

ఇల్లెందు అసెంబ్లీ స్థానం నుంచి కూడా పాత అభ్యర్థులే పోటీ చేస్తున్నా పార్టీలు మాత్రం మారాయి. గత ఎన్నికల్లో బానోతు హరిప్రియ కాంగ్రెస్‌ నుంచి, కోరం కనకయ్య బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత హరిప్రియ బీఆర్‌ఎస్‌లోకి రాగా, ఇటీవల కనకయ్య కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఇలా ఈసారి మళ్లీ ఇద్దరు పోటీ పడుతున్నప్పటికీ పార్టీలు వేర్వేరు కావడం విశేషం.

Advertisement
 
Advertisement