‘జల విద్యుత్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేనా ? | Sakshi
Sakshi News home page

‘జల విద్యుత్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేనా ?

Published Tue, Jun 27 2023 12:10 AM

- - Sakshi

అశ్వాపురం: అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్‌ బ్యారేజీని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం సందర్శించారు. జలవనరుల శాఖ అధికారులు మ్యాప్‌ ద్వారా బ్యారేజీ నిర్మాణ వివరాలను ఆయనకు తెలియజేశారు. సీతమ్మ సాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌ బ్యారేజీకి అనుబంధంగా 280 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బ్యారేజీ పనులు పిల్లర్ల వరకు పూర్తయినా జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణంపై ఇంతవరకూ గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. కాగా, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే జెన్‌కో సీఎండీ సీతమ్మ సాగర్‌ బ్యారేజీని సందర్శించారని సమాచారం.

రాష్ట్రంలోనే కీలకం..
సీతమ్మ సాగర్‌ బ్యారేజీ వద్ద నిర్మించనున్న 280 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రం రాష్ట్రంలోనే కీలకంగా మారనుంది. సీతమ్మ సాగర్‌ జల విద్యుత్‌ కేంద్రంలో ఏడు బల్బ్‌ టర్బైన్ల యూనిట్లు ఉంటాయి. ఒక్కో యూనిట్‌ ద్వారా 40 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగనుంది. ఈ కేంద్రం నుంచి ఏడాదికి సుమారు 1016.88 మెగా యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఇప్పటి వరకు జల విద్యుత్‌ కేంద్రాలన్నీ కృష్ణా నదిపైనే ఉన్నాయి. వీటి సామర్థ్యం 2,369 మెగావాట్లు. గోదావరిపై పోచంపాడు వద్ద 36 మెగావాట్లు, నిజాంసాగర్‌ వద్ద 10 మెగావాట్లు, సింగూరు వద్ద 15 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. సీతమ్మ సాగర్‌ బ్యారేజీ వద్ద గోదావరి నదిపై 280 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్‌ కేంద్రం నిర్మిస్తే ఇదే కీలకం కానుంది.

బీటీపీఎస్‌ను సందర్శించిన సీఎండీ
మణుగూరు రూరల్‌ :
జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం మణుగూరులోని బీటీపీఎస్‌ను సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బీటీపీఎస్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు, జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. అనంతరం బీటీపీఎస్‌ రైల్వేలైన్‌ నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెన్‌కో డైరెక్టర్లు టీఆర్‌కే.రావు, ఎం.సచ్చిదానందం, వెంకటరాజం, అజయ్‌, లక్ష్మయ్య, విద్యుత్‌ సౌధ సీఈ రత్నాకర్‌, బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న, జలవనరులశాఖ ఎస్‌ఈ వెంకటేశ్వరరెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ రాంబాబు, ఏఈ నవీన్‌, విజిలెన్స్‌ అధికారులు వినోద్‌కుమార్‌, ముత్యంరెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు రాంప్రసాద్‌, పార్వతి, రమేష్‌, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement