రఘునాథపాలెం/కామేపల్లి: రైతులు వ్యవసాయంలో ఆధునిక విధానాలపై దృష్టి సారించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని ఆత్మ కమిటీ ఖమ్మం డివిజన్ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు సూచించారు. రఘునాథపాలెం మండలం రాంక్యాతండా, కామేపల్లి మండలం పాత లింగాలలోని రైతు వేదికల్లో ‘ఆత్మ’ఆధ్వర్యాన గురువారం రైతులకు ఏర్పాటుచేసిన శిక్షణల్లో ఆయన మాట్లాడారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్‌తో మంచి లాభాలు ఉంటా యని, వరిలో వెదజల్లే పద్ధతి అవలంబించడం ద్వారా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని వివరించారు. అనంతరం ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడగా ఏఓలు నారాయణరావు, కె.ఉమామహేశ్వర్‌రెడ్డి, తారా దేవి, భాస్కర్‌రావు, ఉద్యానవనాధికారులు నగేష్, ఆకుల వేణుతో పాటు ఉద్యోగులు, కంపెనీల ప్రతినిధులు జగదీశ్వర్, భాస్కర్, కె.ఆనందరావు, శివ, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన ఈఎన్‌సీ
ఖమ్మంఅర్బన్: జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను గురువారం శాఖ ఈఎన్‌సీ మోహన్‌నాయక్ పరిశీలించారు. పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రహదారులు, వంతెనల పరిస్థితిని సమీక్షించారు. రాకాసితండా, కాచిరాజుగూడెం తదితర ప్రాంతాల్లో వరదలతో దెబ్బతిన్న రహదారులు, వంతెనలను పరిశీలించడమే కాక మరమ్మతు, అభివృద్ధి పనులపై ఇంజినీర్లకు సూచనలు చేశారు. ఖమ్మం ఎస్‌ఈ యాకూబ్, ఈఈ పవార్, డీఈ భగవాన్, ఏఈలు పాల్గొన్నారు.
ఔషధ మొక్కలపై దృష్టి సారించాలి
ఖమ్మంరూరల్: రైతులు ఔషధ మొక్కల సాగుపై దృష్టి సారించాలని, తద్వారా లాభా లు ఉంటాయని మెడికల్ ప్లాంట్స్ బోర్డు రీజినల్ సెంటర్(సదరన్ రీజియన్) ఎస్‌ఆర్ డాక్టర్ ఎం.చంద్రశేఖర్ తెలిపా రు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పోలేపల్లిలోని గురుదక్షిణ ఫౌండేషన్, నేచర్ క్యూర్ అండ్ యోగా ఆస్పత్రిలో గురువారం ఔషధ మొక్కల సాగుపై రైతులు, వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ అదనపు ఆదాయం కోసం రైతులు ఔషధ మొక్కల సాగుకు ముందుకు రావాలని తెలిపారు. జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, ఆయుర్వేద డాక్టర్ రమణ, చావా రఘు, జి.శంకరయ్య, నరేంద్ర పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో డోజర్ బ్లేడ్ మాయం
కల్లూరురూరల్: కల్లూరు మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో భద్రపర్చిన డోజర్ బ్లేడ్ ఇనుప ఛానల్ మాయమైంది. దీని విలువ రూ.35వేలకు పైగా ఉంటుందని, కనీసం ముగ్గురు లేదా నలుగురు రాకపోతే తీసుకెళ్లడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇటీవల డోజర్‌కు అమర్చేందుకు ఛానల్ కోసం వెతికినా ఎక్కడా కానరాలేదని సమాచారం. దీంతో ఎవరైనా చోరీ చేశారా, సిబ్బందే భద్రపర్చారా అని ఆరా తీస్తున్నారు.


