● యుద్ధ ప్రభావంతోనే ధరల పెరుగుదల ● సీపీఐ నేతలు కె.నారాయణ, కూనంనేని
ఖమ్మంమయూరిసెంటర్: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులు ఉన్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపేందుకు కనీసం పనిచేయడం లేదని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సాగిలపడుతున్న మోదీకి ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో ఐదుశాతం కూడా లేదని తెలిపారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారతదేశంపై యుద్ధప్రభావం ప్రారంభమైందని, గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండగా.. ఎగుమతులు నిలిచి వ్యయసాయ ఉత్పత్తుల ధరలు పడిపోనున్నాయని తెలిపారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైఖరి సమర్థనీయం కాదని పేర్కొన్న ఆయన.. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ఉన్నందుకు గర్వపడుతున్నా ఆదివాసీలకు నష్టం చేసే చర్యలు చేపట్టే ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడాన్ని సమర్థించబోమని తెలిపారు. ఖమ్మం వెలుగుమట్ల ఘటనపై నారాయణ స్పందిస్తూ భూస్వామ్య భూములను కమ్యూనిస్టులు ఆక్రమించే క్రమంలోనే భూదాన్ ఉద్యమం వచ్చిందన్నారు. వెలుగుమట్లలో నివాసాలను కూల్చడం ఎందుకు, తిరిగి అక్కడే పట్టాలివ్వడం ఎందుకని ప్రశ్నించారు. అక్కడ నివసించేదెవరైనా భారతీయులే అయినందున పేదలందరికీ పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అర్థం, పర్థం లేని చర్యలు రియల్టర్ల కోసమే జరిగాయని ఆయన పేర్కొన్నారు.
కమ్యూనిస్టులను బలహీనపర్చడమే
వారి ధ్యేయం..
కమ్యూనిస్టులను బలహీన పర్చడమే ధ్యేయంగా పెట్టుకున్న వారు అనవసర విమర్శలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తామెలా పని చేయాలో తెలుసునని, పేదల పక్షాన పని చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్న తమపై దురుద్దేశంతో విమర్శలు చేయడం తగదని చెప్పారు. నిత్యం ప్రజల కోసమే పోరాడే తమకు కుహనావాదుల సూచనలు అవసరం లేదన్నారు. నివాస స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ బాధ్యత తప్ప భిక్ష కాదని కూనంనేని తెలిపారు. కమ్యూనిస్టుల అవసరం ఈ సమాజానికి ఉన్నందున రానున్న కాలంలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.


