● హిరియూరుపై అమిత్‌షాతో చర్చించా
● కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి
శివాజీనగర: కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ.సుధాకర్ మరణంతో ఖాళీ అయిన హిరియూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రోజురోజుకు వేడెక్కుతోంది. ఎన్నికల తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, రాజకీయ కార్యకలాపాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. కాగా టిక్కెట్ల పంపిణీ విషయంలో బీజేపీ, జేడీఎస్‌ల మధ్య వివాదం నెలకొంది. దీంతో కేంద్రమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ఒక కీలకమైన వివరణ ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి నియోజకవర్గంలోని వాస్తవ పరిస్థితిని వివరించిన కుమారస్వామి, ఇక్కడ వ్యక్తిగత పరువు కన్నా ఎన్డీయే అభ్యర్థి విజయమే ముఖ్యమనే స్పష్టమైన సందేశాన్ని పంపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి, కర్ణాటకలోని రాజకీయ పరిణామాలపై సవివరంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి, హిరియూరు అసెంబ్లీ ఉప ఎన్నిక, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి సమగ్ర సమాచారం అందించానన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన హెచ్.డీ.కుమారస్వామి హిరియూరు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో తాను గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి కీలక విషయంపై చర్చ జరిపినట్లు తెలిపారు.
అమిత్‌షాతో అన్నీ చర్చించా
● నాకు విశ్వాసం మరింత పెరిగింది
● బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర
బనశంకరి: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను గురువారం భేటీ అయ్యానని, రాష్ట్రాధ్యక్షుడి స్థానం గురించి చర్చించానని, నాకు విశ్వాసం మరింత పెరిగిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర తెలిపారు. శుక్రవారం మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర హోంమంత్రితో రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి సవివరంగా చర్చించానన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు, హిరియూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాధ్యక్ష స్థానంపై చర్చించానని తెలిపారు. భేటీలో ఏం చర్చించాం అనే విషయం బహిరంగంగా చెప్పడం సాధ్యం కాదన్నారు. అమిత్‌షాతో భేటీ కావడం తనలో విశ్వాసం పెంచిందన్నారు. హిరియూరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించే అవకాశం ఉంది. ఎలాంటి గందరగోళం లేకుండా అభ్యర్థిని బరిలోకి దింపుతామన్నారు. జేడీఎస్ నుంచి టికెట్ డిమాండ్ సహజమని, అంతిమంగా పార్టీ సీనియర్లు నిర్ణయం తీసుకుంటారన్నారు.
బసవణ్ణను అగౌరవపరిస్తే ఊరుకోం
● ముఖ్యమంత్రి డీకే శివకుమార్
● రచయితపై ఎఫ్‌ఐఆర్ నమోదు
శివాజీనగర: జగజ్యోతి బసవణ్ణ గురించి అవమానకరమైన వ్యాసం ప్రచురించినందుకు రవి హంజ్‌పై ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, దేశ సాంస్కృతిక నాయకుడి గౌరవాన్ని మసకబార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ, బసవణ్ణ కర్ణాటకకు సాంస్కృతిక చిహ్నమని, 12వ శతాబ్దంలో రాష్ట్ర సామాజిక, మత, సాంస్కృతిక చరిత్రకు కొత్త దిశానిర్దేశం చేసిన గొప్ప స్పూర్తి అని ఆయన అన్నారు. అనుభవ మంటప ద్వారా పార్లమెంటు భవన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత బసవణ్ణకు దక్కింది. సమానత్వం, బానిసత్వం, మానవత్వం, సామాజిక న్యాయం, మహిళలకు సమాన హక్కుల కోసం వాదించిన గొప్ప మానవతావాదిగా ఆయనను స్మరించారు. తమ ప్రభుత్వం బసవణ్ణ కాయక సూత్రాల ఆధారంగా ప్రజానుకూలంగా పని చేస్తూ, వారి ఆశయాలను గౌరవిస్తోందన్నారు. సమాజంలో శాంతికి భంగం కలిగించే వారిపై, బసవణ్ణ సిద్ధాంతాలకు, కన్నడిగుల మనోభావాలకు హాని కలిగించే ఏ ప్రయత్నాలనైనా ప్రభుత్వం కఠినంగా అడ్డుకుంటుందని తెలిపారు.
విద్యుత్ గ్రిడ్ భద్రతకు పథకం
యశవంతపుర: రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచటానికి, సైబర్ ప్రమాదాల బారి నుంచి రక్షించుకోడానికి కర్ణాటక విద్యుత్ సరఫరా మండలి దేశంలోనే మొదటి సారిగా సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ భద్రత పథకాన్ని ప్రారంభించినట్లు ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ తెలిపారు. ఇంటిగ్రేటిడ్ సెక్యూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ పథకంలో భాగంగా కేపీటీసీఎల్ 1,474 ఉపకేంద్రాలు, 6 ఏరియా లోడ్ డిస్పాచ్ సెంటర్లకు ఒకే సమగ్ర సైబర్ భద్రత వ్యవస్థను తెస్తున్నట్లు మంత్రి తెలిపారు. డిజిటల్ యుగంలో గ్రిడ్ సురక్షతను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం ప్రారంభించనున్నట్లు వివరించారు.
అడవిలో ఏనుగు కళేబరం
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని కావేరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో బండళ్లి–తెల్లనూరు రహదారి మధ్య అటవీ ప్రాంతంలో ఒక మగ ఏనుగు మృతదేహం లభ్యమైంది. కావేరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో బండళ్లి గ్రామాన్ని తెల్లనూరు గ్రామంతో కలిపే రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణం సమీపంలో, ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్న అటవీ సిబ్బంది ఒకరు సుమారు 30 ఏళ్ల వయసున్న ఒక చనిపోయిన ఏనుగు కళేబరాన్ని గుర్తించారు. ఆయన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుందర్ ఘటనా స్థలాన్ని సందర్శించి ఏనుగు కళేబరాన్ని పరిశీలించారు. ఏనుగు సహజంగానే మరణించినట్లు భావిస్తున్నారు. ఏనుగు మరణానికి గల కచ్ఛితమైన కారణాన్ని తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. వయో సంబంధిత అనారోగ్యం వల్ల మరణించిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుంది.


