లోకాయుక్త పంజా | - | Sakshi
Sakshi News home page

లోకాయుక్త పంజా

Nov 21 2026 2:44 AM | Updated on Nov 21 2026 2:44 AM

తుమకూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో లోకాయుక్త అధికారులు తెల్లవారుజామున ఏకకాలంలో తుమకూరు జిల్లాలోని శిర పట్టణాభివద్ధి సంస్థ కమిషనర్‌ బీ.టీ.రంగస్వామి నివాసం, కార్యాలయంతో సహా 5 చోట్ల దాడులు నిర్వహించారు. శిర కార్యాలయం, తుమకూరు, బెంగళూరు నివాసం, హిరియూరు, చిత్రదుర్గతో సహా 5 చోట్ల లోకాయుక్త పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి శిర పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్‌ను దిగ్భ్రాంతికి గురి చేశారు. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో కారులో శిర పట్టణాభివద్ధి సంస్థ కార్యాలయానికి చేరుకున్న లోకాయుక్త ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర నేతృత్వంలోని అధికారులు హఠాత్తుగా కార్యాలయంలోకి ప్రవేశించి, పట్టణాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి, మరిన్ని పత్రాల కోసం కార్యాలయం మొత్తం సోదాలు నిర్వహించారు. శిరా పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలోని లేఅవుట్‌ నిర్మాణంలో అవకతవకలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో లోకాయుక్త అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు.

కీలక ఫైళ్ల తనిఖీ

లోకాయుక్త అధికారులు శిరా పట్టణ అభివృద్ధి సంస్థ కార్యాలయంపై సోదాలు నిర్వహించినప్పుడు కమిషనర్‌ అక్కడ లేరు. ఆ సమయంలో లోకాయుక్త అధికారులు కార్యాలయ సిబ్బంది ద్వారా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారని సమాచారం. కార్యాలయంలోని సిబ్బంది ద్వారా జరుగుతున్న అక్రమ లేఅవుట్‌ నిర్మాణం గురించి కొంత సమాచారం సేకరించిన లోకాయుక్త అధికారులు, లేఅవుట్‌ నిర్మాణానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా సోదా చేశారు. ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో జరిగిన ఈ ఆకస్మిక సోదా శిరా నగరంలో తీవ్ర ఉత్సుకతను రేకెత్తించింది. లోకాయుక్త అధికారులు తర్వాత ఏం చేస్తారోనని శిరా నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా తుమకూరు, చిత్రదుర్గ, హిరియూరు, బెంగళూరుల్లో సుడా కమిషనర్‌కు చెందినవిగా చెబుతున్న నివాసాలపై లోకాయుక్త అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ స్థలాల్లో కమిషనర్‌కు చెందిన అక్రమ ఆస్తుల సేకరణకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.

సుడా కమిషనర్‌ కార్యాలయం,

నివాసాలపై దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement