శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ తొలిసారిగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖకు రూ.16 వేల కోట్ల గ్రాంటును అందించింది. దీంతో పంచాయితీ స్థాయిలో రోడ్లు, మురుగు నీటిపారుదల, తాగునీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.6వేల కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ తెలిపారు. శుక్రవారం విధానసౌధ బ్యాంక్వెట్ హాల్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి గ్రామీణ రహదారి అనుసంధాన పథకం, ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. రూ.16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేయాలని అన్నారు. ప్రగతి పథ్ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయించామన్నారు.
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందుకోసం ప్రజాసేవ వ్యవస్థను అమలు చేశామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను వినాలి. అందిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం అందించాలి. ఈ ప్రక్రియను జడ్పీ సీఈఓలు నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కూడా అనేక పథకాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను తనిఖీ చేసే బాధ్యత జడ్పీ సీఈఓలు, అధికారులపై ఉందని ఆయన అన్నారు. ఆర్‌ఓ యూనిట్ల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. పేదలకు ప్లాట్లు అందించే లక్ష్యంతో 15 లక్షల ప్లాట్లను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన తెలిపారు. మంత్రులు ఈశ్వర్ బీ.ఖండ్రె, బసవంతప్ప, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి టీ.బీ.జయచంద్ర, ఎమ్మెల్యేలు ఎన్.హెచ్.కోనరెడ్డి, రహీం ఖాన్, అశోక్ పట్టణ్, వెంకటశివారెడ్డి, గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ ప్రధానకార్యదర్శి పంకజ్‌కుమార్ పాండె తదితరులు పాల్గొన్నారు.
రూ.16 వేల కోట్లు కేటాయింపు
ముఖ్యమంత్రి డీకే శివకుమార్


