క్యాంటీన్‌, శానిటరీ స్టోర్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

క్యాంటీన్‌, శానిటరీ స్టోర్‌ దగ్ధం

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

మండ్య: మంటలు అంటుకుని వరుసగా హోటల్‌, షాపులు కాలిపోయిన ఘటన మండ్య అశోకనగరలో శనివారం తెల్లవారుజామున జరిగింది. తిమ్మేగౌడ అనే వ్యక్తికి చెందిన కాఫీ క్యాంటీన్‌లో మొదట అగ్నిప్రమాదం సంభవించింది. పక్కన ఉన్న రిషబ్‌ టైల్స్‌ శానిటరీ స్టోర్‌కు మంటలు వ్యాపించి భారీగా తగలబడింది. క్యాంటీన్‌లో యూపీఎస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. తరువాత వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ప్రమాదం అధికమైంది. స్టోర్‌లోని 3 ఫ్రీజర్లు, 2 డబుల్‌ డోర్‌ ఫ్రీజర్లు, టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు ఇతర వంట సామగ్రి కాలిబూడిదయ్యాయి. శానిటరీ షాప్‌లో కూడా భారీగా ఆస్తినష్టం జరిగింది. ఫైర్‌ అధికారి రాఘవేంద్ర నేతృత్వంలో సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేసేటప్పటికీ బూడిద మిగిలింది. ఎమ్మెల్యే పీ.రవికుమార్‌ పరిశీలించి హోటల్‌ యజమాని తిమ్మేగౌడను పరామర్శించారు. రూ.20 లక్షల మేర పెట్టుబడి పెట్టామని, అంతా పోయిందని విలపించాడు.

పెట్రోల్‌ ట్యాంకర్‌ పల్టీ

యశవంతపుర: బెంగళూరు నుంచి మంగళూరుకు వెళుతున్న పెట్రోల్‌ ట్యాంకర్‌ లారీ పల్టీ పడిన ఘటనలో వేలాది లీటర్ల పెట్రోల్‌ నేలపాలైంది. శనివారం హాసన్‌ దగ్గర కెంచటహళ్లి వంతెనపై ఈ ఘటన జరిగింది. వీకెండ్‌ కావడంతో వాహనాల రద్దీ ఉన్న సమయంలో లారీ బోల్తా పడి పెట్రోలు ప్రవహించింది. శనివారం మధ్యాహ్నం ఎండలు కూడా విపరీతంగా ఉన్న కారణంగా ఏం విపత్తు జరుగుతుందో అని అందరూ కలవరపడ్డారు. పోలీసులు వంతెనను అటు ఇటు బంద్‌ చేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. ట్యాంకర్‌ను క్రేన్లతో అతి కష్టంపై పక్కకు తొలగించారు.

గణపతుల వితరణ

శివాజీనగర: పర్యావరణ హితం, ఆరోగ్యంపై దృష్టి సారించాలని సినీ నటి రాగిని ద్వివేది తెలిపింది. బెంగళూరు భారతీ నగర కాక్స్‌టౌన్‌ గంగమ్మ ఆలయం వద్ద పౌర కార్మికుల పిల్లలకు మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీలో ఆమె పాల్గొంది. 14వ తేదీన విఘ్నాలను తొలగించే గణపతి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపింది.

ప్రేమజంట ఆత్మార్పణం

దొడ్డబళ్లాపురం: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే ఆవేదనతో మహిళ, యువకుడు ఒకే చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా సుంకనూరు గ్రామంలో జరిగింది. చిత్తాపుర పట్టణానికి చెందిన శరణమ్మ (32), యాదగిరి జిల్లా బాచవార గ్రామం నివాసి బసవరాజు (21) వయసులో చాలా తేడా ఉన్నా ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగుతోంది, వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో కలిసి జీవించలేమని విరక్తి చెంది ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. చిత్తాపుర పోలీసులు కేసు నమోదు చేశారు.

14న సిటీలో మాంసం బంద్‌

శివాజీనగర: బెంగళూరు నగరంలో ఈ నెల 14న సోమవారం మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. గణేష్‌ చతుర్థి పండుగ అయినందున ఎవరూ మాంసం అమ్మరాదని జీబీఏ అధికారులు ప్రకటించారు. ఆరోజు కబేళాలలో జంతు వధకు అనుమతి లేదు. మాంసం దుకాణాలు తెరవరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement