రాయచూరు రూరల్: సమాజం అభివృద్ధికి పిల్లలకు మానవత్వం, నైతిక విలువలతో కూడిన సంస్కారం నేర్పాలని ఉరిలింగ పెద్ది పీఠాధిపతి జ్ఞాన ప్రకాష్ స్వామీజీ, బీదర్ బుద్ధవిహార్ ధర్మదీప భంతేజ పిలుపునిచ్చారు. శనివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో నైతిక విలువలు, సంస్కారం అనే అంశంపై ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిల్లలకు బోధన చేయడంతో పాటు అన్ని విధాలుగా సంస్కారాలను అలవర్చుకోవాలన్నారు. మహదేవ స్వామి, వసంత్, సంతోష్, నందిని, మల్లేష్, భీమణ్ణ, అంబరేష్, దత్తాత్రేయ, తిమ్మారెడ్డి, లక్ష్మణ్, అర్చన, కవిత, ఆరతిలున్నారు.
కుస్తీ హాల్ నిర్మాణానికి భూమిపూజ
హుబ్లీ: జిల్లా మైదానంలో కుస్తీ, జిమ్ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరవింద బెల్లద భూమిపూజ నెరవేర్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా మైదానంలో మరొక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టడం హర్షణీయం అన్నారు. గతం మూడు, నాలుగేళ్ల గడువులో జిల్లాలో క్రీడా రంగానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. బాస్కెట్ బాల్ మైదానం ప్రారంభమైంది. వాలీబాల్ కోర్టు నిర్మాణ పనులు ప్రగతి పథంలో ఉన్నాయి. ప్రస్తుతం కుస్తీ హాల్, జిమ్ హాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈత కొలను నిర్మించాం. దీంతో జిల్లా క్రీడా రంగానికి, యువ క్రీడాకారులకు ప్రోత్సాహం లభించిందన్నారు. హుబ్లీలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఉద్దేశ క్రీడా కాంప్లెక్స్‌ను నిర్మించామన్నారు. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 21 క్రీడా సదుపాయాలు కల్పించారన్నారు. ఈ అవకాశాలను యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుస్తీ కోచ్ శివప్ప పాటిల్, ప్రముఖులు సదానంద, జిన్నప్ప, మంజునాథ, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సేవతో
ప్రజల కలలు సాకారం
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేర్చడం ద్వారా ప్రజల వద్దకు పాలనతో ప్రజల కలలు సాకారం అవుతాయని తహసీల్దార్ సురేష్‌వర్మ పేర్కొన్నారు. ఆయన శనివారం రాయచూరు తాలూకా బిజనగేర హైస్కూలు మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా సేవ పథకం కింద దరఖాస్తులను అందుకుని మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. టీపీ ఈఓ చంద్రశేఖర్ పవార్, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి మంజునాథ్, ఆరోగ్య అధికారి యోగేష్‌లున్నారు.
అస్పృశ్యతను నివారిద్దాం
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అస్పృశ్యతను నివారిద్దామని లింగసూగూరు తహసీల్దార్ సత్యమ్మ పేర్కొన్నారు. శనివారం తాలూకాలోని ఆనెహొసూరు, ఈచనాళల్లో ఇటీవల దళితుడికి హోటల్‌లో నీటిని చేతిలో పోసి తాగించిన వీడియో వైరల్ కావడంతో గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ఎంతగా మారినా అగ్ర వర్ణాల వారు ఇంకా దళితులను దేవాలయాల్లోకి ప్రవేశ నిరాకరణ చేయడం, నీటిని ఎత్తిపోయడం వంటివి కొనసాగుతుండటం శోచనీయమన్నారు. ఇలాంటివి పునరావృతం అయితే భారీ జరిమానా విధిస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో సీఐ హొసకెరప్ప, బసవరాజ్, మోహన్, ఆరోగ్య అధికారి రాజేశ్వరి, పుష్పలత, రామకృష్ణ, ధరంసింగ్‌లున్నారు.
జాతీయ రహదారి పనుల
భూస్వాధీనానికి అనుమతి
రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాల్లో జాతీయ రహదారి పనుల భూస్వాధీనానికి అనుమతి లభించిందని రాయచూర్ లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ పేర్కొన్నారు. శనివారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఆయన వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. యాదగిరి జిల్లాలో జాతీయ రహదారి పనులను పరిశీలించినట్లు తెలిపారు. భారత్ మాల పథకంలో రాయచూరు–శహాపూర్ మధ్య పనులను నాణ్యతతో పాటు రాయచూరు– బెళగావి మధ్య పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు భూస్వాధీనానికి మంత్రి ఆదేశించారన్నారు. ప్రధాన రహదారి నిర్మాణంలో లోపాలను సవరించకుండా అశాసీ్త్రయంగా పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు.


