సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో బళ్లారి తాలూకాలో నీటిపారుదల సౌకర్యం లేని కుగ్రామం అది. కేవలం వర్షాధారిత పంటలు మాత్రమే పండించే కరువు నేలలో వ్యవసాయ కూలీలతో పాటు రైతులకు కూడా జీవనాధారం కష్టంగా ఉన్న ఆ గ్రామంలో గణేష్ విగ్రహాలను తయారు చేస్తూ గ్రామస్తులు ఉపాధి పొందుతున్నారు. బళ్లారి తాలూకా కే.వీరాపుర గ్రామం వినాయక విగ్రహాల తయారీకి మారుపేరుగా నిలిచింది. ఈ గ్రామంలో బోరుబావుల సదుపాయం కూడా చాలా తక్కువే. వ్యవసాయ కూలీలకే కాదు రైతులకు కూడా ఏడాది పాటు తమ పొలాల్లో పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. అయితే గ్రామంలో కొన్నేళ్లుగా వినాయకుల తయారీపై దృష్టి పెట్టారు. దానినే ఉపాధిగా మలచుకుని, అటు దైవభక్తి, ఇటు ఉపాధి కూడా దొరకడంతో విగ్రహాలను తయారు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు.
కరువు ప్రాంతంలో గ్రామస్తులకు ఉపాధి
కే.వీరాపురలో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలను ఒక్క బళ్లారి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల వారు మాత్రమే కొనుగోలు చేస్తారనుకుంటే పొరపాటు. ఇక్కడ తయారు చేసిన వినాయక విగ్రహాల కొనుగోలుకు కర్ణాటకతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తుండటం విశేషం. గ్రామంలో వందలాది మంది వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో ప్రధానంగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న రామచంద్ర సాక్షితో మాట్లాడుతూ తమ గ్రామంలో మట్టితో తయారు చేసిన ఎత్తైన వినాయక విగ్రహాల నుంచి చిన్న వినాయక విగ్రహాల వరకు తయారు చేస్తున్నామన్నారు. తాము 40 మంది గ్రూపుగా ఏర్పడి దాదాపు 800లకు పైగా వినాయక విగ్రహాలను తయారు చేశామన్నారు. అన్నింటిని కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు వచ్చాయన్నారు.
ఏటా 8 నెలల పాటు చేతినిండా పని
కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలకు తాము వినాయక విగ్రహాలు విక్రయిస్తున్నామన్నారు. తమతో పాటు గ్రామంలో ఎంతో మంది గ్రూపులుగా ఏర్పడి వినాయక విగ్రహాలు తయారు చేసి, అమ్ముతున్నారన్నారు. ఏడాదిలో 8 నెలల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో షెడ్లలో రకరకాల ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నామన్నారు. చూడచక్కగా వినాయక విగ్రహాలు తయారు చేయడం వల్ల ఏటేటా తమ గ్రామం వినాయక విగ్రహాల తయారీకి మారుపేరుగా నిలిచిందన్నారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వీరాపుర అనే విధంగా మారిందని, అదంతా ఆ వినాయకుని కృపేనని అన్నారు. వర్షాలు లేక పంటలు పండక ఇబ్బందులు పడుతున్న రైతులకు, వ్యవసాయ కూలీలకు వినాయక విగ్రహాల తయారీతో ఉపాధి లభిస్తోందన్నారు. విగ్రహాలు తయారు చేసే కూలీలకు రోజుకు కనీసం రూ.500లకు తక్కువ కాకుండా కూలి దొరుకుతోందన్నారు. ఇక వినాయక చవితి సమీపించటంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, మిత్రమండళ్ల సభ్యులు వచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసుకెళుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.
వినాయక విగ్రహాల తయారీ
కేంద్రంగా కే.వీరాపుర
పలు రాష్ట్రాల నుంచి గణేష్ ప్రతిమల కొనుగోలుకు భారీగా ఆర్డర్లు


