హుబ్లీ: వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ(ఎన్‌ఈకేఆర్‌టీసీ) బస్సు హెడ్‌లైట్ పని చేయక పోవడంతో మొబైల్ టార్చ్ వెలుగులోనే డ్రైవర్ బస్సును ధై ర్యంగా నడిపిన ఘటన చోటు చేసుకుంది. హుబ్లీ నుంచి అణ్ణిగేరికి వెళుతున్న రాత్రి డ్యూటీ బస్సు హెడ్‌లైట్‌లో సాంకేతిక దోషం కనిపించింది. దీంతో ప్రయాణికులతో మొబైల్ టార్చ్ వెలుగులోనే డ్రైవర్ ఆ బస్సును నడిపి సురక్షితంగా గమ్యం చేర్చిన ఘటన శుక్రవారం సంశి– గుడగేరి మార్గంలో జరిగింది. హుబ్లీ నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరి గుడగేరికి రాత్రి 9.20 గంటలకు చేరుకోవాలని బస్సు సంశి బస్టాండ్ సమీపంలోకి రాగానే ప్రధాన హెడ్‌లైట్ పని చేయక మొరాయించడంతో బస్సులోని ప్రయాణికులు కంగారు పడ్డారు. సంశి నుంచి గుడగేరికి ప్రయాణం సుమారు 20 నిమిషాలు పడుతుంది. దీంతో ప్రయాణికులు తమ మొబైల్ టార్చ్‌లను ఆన్ చేసి డ్రైవర్‌కు సహకరించడంతో బతుకు జీవుడా అంటు నిదానంగా బస్సును నడిపి క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు.
కొందరు ప్రయాణికుల మండిపాటు
కాగా ఈ వైనంపై కొందరు ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి వేళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే అత్యవసరమైన బస్సు సర్వీసులు డిపో నుంచి బయలుదేరే ముందు అవి సక్రమంగా, సాంకేతికంగా సిద్ధంగా ఉన్నాయా, లేదా? అని పరిశశీలించాలి. ఏ దోషాలు లేని బస్సులను మాత్రమే గ్రామీణ ప్రాంతాలకు నడపాలి. లేకుంటే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తథ్యం అని ప్రయాణికులు వాపోయారు. ఈ 12 కిలో మీటర్ల ప్రయాణానికి సుమారు ఓ గంట సేపు సమయం పట్టింది. ఈ ఘటనపై సంబంధిత డిపో కంట్రోలర్ రామనగౌడ మాట్లాడుతూ ఎండీ ఎం.ప్రియాంగ సూచన మేరకు ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇలాంటి ఘటనే గత జూలైలో కూడా కేకేఆర్‌టీసీ పరిధిలో చోటు చేసుకుంది. కలబుర్గి నుంచి చించోళికి వెళుతున్న బస్సు హెడ్‌లైట్లు మొరాయించడంతో మొబైల్ టార్చ్ వెలుగులోనే డ్రైవర్ బస్సును నడిపాడు. ఆ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు డ్రైవర్‌తో పాటు ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.
హెడ్‌లైట్లు వెలగని బస్సును మొబైల్ టార్చ్ వెలుగులో నడిపిన డ్రైవర్
ఎన్‌ఈకేఆర్టీసీ బస్సుల అధ్వాన నిర్వహణకు నిదర్శనం ఈ ఘటన


