బనశంకరి: శ్రీకృష్ణ భగవానుడి జన్మదినోత్సవం(శ్రీకృష్ణాష్టమి) వేడుకలను శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బెంగళూరు నగరంలోని రాజాజీనగర, వసంతపుర ఇస్కాన్‌తో పాటు వివిధ ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా చేపట్టారు. కృష్ణాష్టమి సందర్భంగా రాజాజీనగర ఇస్కాన్ ఆలయంలో బృందావన బృందం ప్రధాన ఆలయాన్ని నెమలి ఈకలతో అలంకరించారు. రంగమందిరంలో రాధాకృష్ణ ఉత్సవ విగ్రహాల కోసం 108 రకాల జలామృతాలతో నాలుగుసార్లు అభిషేకం చేసి రాధాకృష్ణ విగ్రహాలకు ప్రత్యేక పూల అలంకరణ చేపట్టి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో చిన్నారుల రాధాకృష్ణ వేషధారణల సందడి నెలకొంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భక్తులు ఇస్కాన్ దేవస్థానానికి భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి వరకు భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉడుపిలో శ్రీకృష్ణ వైభవం
యశవంతపుర: ఉడుపి శ్రీకృష్ణ మఠంలో శ్రీకృష్ణ జన్మాష్ఠమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం పర్యాయ మఠాధిపతి వేదవర్థనతీర్థ మహాపూజను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఉడుపి మఠాన్ని దర్శించుకున్నారు. రాత్రి అర్చన మహా పూజలు చేశారు. ఉదయం లడ్డూలను శ్రీకృష్ణుడికి నివేదించారు. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడో రోజు లీలోత్సవ మృణ్మయ మూర్తికి పూజలు చేశారు. శ్రీకృష్ణ మఠాన్ని విశేషంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ధర్మాన్ని స్థాపించి ఆధర్మ సంహారం కోసం అవతరించిన శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను ఉడుపిలో సంబరంగా నిర్వహిస్తున్నారు.
వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
దర్శనానికి బారులు తీరిన భక్తులు


