యశవంతపుర/శివాజీనగర/హొసపేటె: కరువు పరిస్థితులపై సీఎం డీకే శివకుమార్ శుక్రవారం బాగలకోటె, విజయనగర, బళ్లారి జిల్లాల్లో వైమానిక సర్వే నిర్వహించారు. హెలికాప్టర్‌లో వివిధ ప్రదేశాలలో సంచరించిన సీఎం.. బాగలకోటె జిల్లా హునగుంద తాలూకా ధన్నూరు గ్రామంలో సూర్యకాంతి, ఉల్లి పంట నష్టాన్ని సమీక్షించారు. వానల కొరతతో ఎండిన వ్యవసాయ భూములను, హానికి గురై, కరువుతో ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితిని పరిశీలించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాంకాళ వైద్య, ఎంపీ డాక్టర్ జేసీ చంద్రశేఖర్ సీఎం వెంట పాల్గొన్నారు.
కూడలసంగమలో పూజలు
సీఎం డీకే శివకుమార్ బాగలకోటె జిల్లా కూడలసంగమలోని సంగమేశ్వర ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా నదికి వాయనం సమర్పించారు.
రుణమాఫీ చేయాలి
రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై విపక్షాలతో కలిసి కేంద్రంతో భేటీ కావాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. సదాశివనగరలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.


