త్వరలోనే బస్సు చార్జీల పెంపు | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే బస్సు చార్జీల పెంపు

Sep 5 2026 5:37 AM | Updated on Sep 5 2026 5:37 AM

సాక్షి బెంగళూరు: త్వరలో ఆర్టీసీ బస్సు టికెట్‌ ధరలను పెంచనున్నట్లు రవాణా శాఖ మంత్రి బైరతీ సురేశ్‌ వెల్లడించారు. బెంగళూరులో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముడిచమురు ఉత్పత్తుల ధరలను పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్‌ చార్జీలను పెంచాల్సి వస్తోందని తెలిపారు. గత 8 నెలల నుంచి క్రమంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నా బస్సు ప్రయాణ చార్జీలను పెంచలేదని, దానివల్ల నాలుగు ఆర్టీసీ సంస్థలకు రూ.వేలాది కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని గుర్తు చేశారు. విశ్రాంత సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అతుల్‌ తివారి నేతృత్వంలోని కమిటీ చార్జీల పెంపునకు సంబంధించి అధ్యయనం చేపట్టి ఇటీవలే నివేదిక సమర్పించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత కరువు పరిస్థితుల నేపథ్యంలో సామాన్య ప్రజలపై అధిక భారం మోపకుండా స్వల్ప ప్రమాణంలో బస్సు చార్జీలను పెంచుతామని తెలిపారు.

మళ్లీ టోయింగ్‌ ప్రారంభం

సాక్షి బెంగళూరు: నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు అక్రమ పార్కింగ్‌కు వ్యతిరేకంగా టోయింగ్‌ వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. వాహనాలను ఇష్టానుసారం నిలిపే వారిపై జరిమానాలతో విరుచుకుపడుతున్నారు. వారం రోజులుగా శాంతినగర చుట్టుపక్కల ప్రాంతాల్లో టోయింగ్‌ను ఎక్కువగా నిర్వహించారు. సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీ, దివ్యశ్రీ చాంబర్స్‌ వద్ద నో పార్కింగ్‌ ఫలకాలను అమర్చారు. అక్కడ నిలిపిన వాహనాలను టోయింగ్‌ చేస్తున్నారు. బైక్‌లకు రూ. 1,150, నాలుగు చక్రాల వాహనాలకు రూ. 1,500 మేర జరిమానా విధిస్తున్నారు.

కోలారు జిల్లాలో

ఈడీ దాడులు

కోలారు: కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరు తాలూకా జోడి కృష్ణాపుర గ్రామంలో మృత్యుంజయ అనే వ్యక్తి ఇంటిపై ఈడీ అధికారులు దాడి జరిపి సోదాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నగదు అక్రమ బదిలీకి సంబంధించి అతనిపై గతంలో బెంగుళూరు తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో కోలారు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు బెంగళూరు రూరల్‌ జిల్లా హొసకోటెలో ఇతనికి చెందిన ఇళ్లపై ఈడీ అధికారులు గురువారం రాత్రి వరకు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.

కంతులు చెల్లించలేదని

ఇంటికి తాళం

యశవంతపుర: కరువుతో రైతులు ఇబ్బంది పడుతున్నా బ్యాంకర్లు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. రుణం కంతు చెల్లించలేదని ప్రైవేట్‌ బ్యాంక్‌ సిబ్బంది ఓ ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన హాసన తాలూకాలో జరిగింది. ఉగనె కొప్పలు గ్రామానికి చెందిన రైతు మహిళ సుమా 2023లో తన ఇంటిని క్వెటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.12 లక్షల రుణం తీసుకుంది. రెండేళ్లపాటు కంతులు చెల్లించి మూడు లక్షలు తీర్చారు. మొదట 9 శాతం వడ్డీ వేయగా అనంతరం దుబారు వడ్డీ వేశారు. దీంతో కంతులు చెల్లించడంలో జాప్యం జరిగింది. మరో వైపు తాకట్టు పెట్టిన ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలతో కూలిపోయింది. ఈక్రమంలో ఆ బ్యాంక్‌ సిబ్బంది ఆ మహిళా రైతుపై కోర్టులో కేసు వేశారు. ఇంటిని సీజ్‌ చేయాలని కోర్టు అదేశించింది. 12 రోజుల క్రితం బ్యాంక్‌ సిబ్బంది ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. ఆ గ్రామానికి చెందిన మరో మహిళ రత్నమ్మ, గురువయ్య దంపతులు ఇదే బ్యాంక్‌లో భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. మూడేళ్లపాటు నెలకు రూ.18 వేలు కట్టారు. వర్షాలతో వీరి ఇల్లు కూడా కూలిపోయింది. ఫైనాన్స్‌ సంస్థ వారిపై కూడా కేసులు వేసి భూమిని లాక్కోవటానికి యత్నిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

జైలు వార్డెన్‌పై ఖైదీల హత్యాయత్నం

బనశంకరి: జైలు వార్డెన్‌పై రిమాండ్‌ ఖైదీలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఘటన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో జరిగింది. మంగళూరుకు చెందిన భజరంగదళ్‌ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య కేసు నిందితులు ఈ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. ఈనెల 2న ఉదయం జైలు వార్డెన్‌ మంజునాథ్‌ హవేలి ఖైదీ నుంచి సమాచారం కోసం అనెక్స్‌–1 బ్యారక్‌ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో మహమ్మద్‌ ముజాయిద్‌ అనే ఖైదీ మంజునాథ్‌ హావేలిని దూషించి ముఖంపై రక్తం వచ్చేలా గాయపరిచాడు. అనంతరం అతడి వెంట ఉన్న అబ్దుల్‌ చౌహాన్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, నయాజ్‌, కలందర్‌ షఫీలు కలిసి వార్డెన్‌ను గదిలోకి తీసుకెళ్లి దాడి చేసి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జైలు సిబ్బంది అతడిని కాపాడారు. దాడికి పాల్పడిన ఐదుగురు ఖైదీలపై కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement