రాయచూరు రూరల్: తీవ్ర వర్షాభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతుల రుణాలు మాఫీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం నాలుగో రోజు బీజేపీ నాయకులు పాదయాత్ర కొనసాగించారు. సింధనూరు–కారటగి క్రాస్ వద్ద పాదయాత్రకు ముందు విజయేంద్ర విలేకరులతో మాట్లాడారు. వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించకుండా అధికారం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా మార్గంమధ్యలో పొలం గట్టుపై కూర్చొన్న విజయేంద్ర.. కూలీలతో కలసి భోజనం చేశారు. రైతులతో కలసి వరినాట్లు వేశారు. మాజీ మంత్రులు శ్రీరాములు,రాజు గౌడ, శాసన సభ్యుడు మానప్పవజ్జల్, నాయకులు ప్రతాప్ పాటిల్, శరణమ్మ కామరెడ్డి పాల్గొన్నారు.


