రాయచూరు రూరల్: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో గురు రాఘవేంద్రుల 355వ ఆరాధన మహోత్సవాలు (సప్తరాత్రోత్సవాలు) వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉత్తర ఆరాధనోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి బంగారు రథోత్సవం (మహారథోత్సవం) వైభవంగా సాగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ పాదంగళ్ ఆధ్వర్యంలో రాయలవారి పవిత్ర బృందావనానికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, తులసీ అర్చనలు శాస్త్రోక్తంగా చేపట్టారు. రథోత్సవ సమయంలో హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. భజనలు, మేళతాళాలు, భక్తుల రాయల నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి రాయల వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మఠం అధికారులు ఉచిత అన్నదానం, తాగునీరు, వైద్య సౌకర్యాలు కల్పించారు.
భక్తిశ్రద్ధలతో రథోత్సవం
సాక్షి, బళ్లారి: నగరంలోని సత్యనారాయణ పేటలో వెలసిన గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ఆరాధనోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. సోమవారం భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో తేరు లాగారు. రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాయల నామస్మరణతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి ఆలయ పూజారులు, గురువులు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్ దివాకర్, స్థానిక కార్పొరేటర్ ఆర్.అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాఘవేంద్రుడి ఉత్తర ఆరాధన
మార్మోగిన రాయల నామస్మరణ
భక్తులతో పోటెత్తిన మంత్రాలయం


