మంత్రి నాగేంద్రకు పొగ? | - | Sakshi
Sakshi News home page

మంత్రి నాగేంద్రకు పొగ?

Aug 27 2026 12:30 AM | Updated on Aug 27 2026 12:30 AM

సాక్షి, బళ్లారి/ బనశంకరి: ఓవైపు ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలు, మరోవైపు విచారణకు సీబీఐ సిద్ధం కావడం తదితర కారణాలతో మంత్రి బి.నాగేంద్ర ఆ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. లేక సీఎం డీకే శివకుమార్‌ ఆయనకు రాజీనామా చేయాలనే సూచన ఇచ్చారా? అనేది తేలాల్సి ఉంది. కోట్లాది రూపాయల మహర్షి వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి కుంభకోణంలో నిందితుడు కావడం ఆయనకు పెద్ద సమస్యగా మారింది. ఈ పరిణామాలు బళ్లారి జిల్లాలో ఆయన అనుచరులు, అభిమానుల్లో కలవరం నింపాయి.

రాజీనామాకు సుముఖత?

తన వల్ల ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బంది కలుగుతున్నందున రాజీనామా చేస్తానని మంత్రి నాగేంద్ర సీఎం డీకే శివకుమార్‌కు చెప్పినట్లు తెలిసింది. అయితే గురువారం ఢిల్లీకి వెళ్తానని, అక్కడ తీర్మానం చేసేవరకూ మౌనంగా ఉండాలని సీఎం సూచించారని ప్రచారం గుప్పుమంది. నాగేంద్ర దిగిపోవాలని బీజేపీ గత 10 రోజులుగా పలు జిల్లాల్లో ఆందోళనలు చేయడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ధర్నాలతో స్తంభింపజేసింది. పైగా రాయచూరు నుంచి బళ్లారికి సెప్టెంబరు 1 నుంచి 10 రోజుల పాటు పాదయాత్ర చేయాలని బీజేపీ తీర్మానించింది. ఇదంతా డీకే ప్రభుత్వానికి కంటగింపుగా తయారైంది అనడంలో సందేహం లేదు.

అందరూ క్రమశిక్షణ కలిగిన సిపాయిలు

కాంగ్రెస్‌ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ క్రమశిక్షణ కలిగిన సిపాయిలని సీఎం డీకే.శివకుమార్‌ అన్నారు. బెంగళూరులో ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. మంత్రి నాగేంద్ర రాజీనామా చేస్తున్నారట అని అడగ్గా, పై సమాధానం ఇచ్చారు. మరోవైపు రాజీనామా ప్రచారాన్ని మంత్రి నాగేంద్ర కార్యాలయం తోసిపుచ్చింది. అలాంటి ప్రస్తావన లేదని తెలిపింది.

సీఎం డీకే ఢిల్లీకి

బనశంకరి: రాష్ట్రంలో రాజకీయం అంత బాగా లేని సమయంలో సీఎం డీకే.శివకుమార్‌ ఢిల్లీకి వెళ్తుండడం కుతూహలం రేకెత్తిస్తోంది. గురువారం ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌ నేతలను కలుస్తారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఒక స్థానానికి మంత్రి ఎంపికతో పాటు పలువురి శాఖల మార్పు, వీలైతే కొందరిని తొలగించే అంశం తదితరాలపై చర్చిస్తారని సమాచారం. నాగేంద్ర సంగతి, అసెంబ్లీలో ప్రతిపక్షాల రభస, అడవుల్లో ఎన్‌కౌంటర్‌ ఇతరత్రా అంశాలు ప్రస్తావనకు రావచ్చు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరులోనే ఉండగా సీఎం డీకే బుధవారం సాయంత్రం ఆయనతో సమావేశమయ్యారు. ఖర్గే కూడా గురువారం ఢిల్లీకి వెళ్లి చర్చల్లో పాల్గొంటారు.

ఇటీవల అసెంబ్లీలో మంత్రి నాగేంద్ర

నాగేంద్రకు వ్యతిరేకంగా హుబ్లీలో ధర్నా

సిద్దరామయ్య, డీకే శివకుమార్‌

రాజీనామాకు సంసిద్ధం!

ఇంటా బయటా బీజేపీ ధర్నాలతో సర్కారు సతమతం

నేడు ఢిల్లీకి డీకే ప్రయాణం

హైకమాండ్‌ నేతలతో చర్చలు

బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే, గణాంక, ప్రణాళిక శాఖల మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేయబోతున్నట్లు మంగళవారం రాత్రి

నుంచి ప్రచారం గుప్పుమంది. ఆయన లక్ష్యంగా ప్రతిపక్ష బీజేపీ పోరాటాలతో హోరెత్తిస్తుండడంతో కాంగ్రెస్‌ సర్కారుకు సవాలుగా మారింది. ఆయన గతంలో సిద్దరామయ్య హయాంలో సుమారు ఏడాదిన్నరకు తప్పుకుంటే, తాజాగా డీకే శివ ప్రభుత్వంలో 3 నెలలకే రెండో ఇన్నింగ్స్‌ ముగిసిపోతోందా? అనే సందిగ్ధత రాజ్యమేలుతోంది.

నాగేంద్ర తప్పుకో: విజయేంద్ర

బనశంకరి: వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల కుంభకోణంలో లూటీ చేసిన నిందితుడు, మంత్రి బీ.నాగేంద్ర దర్యాప్తులో నిరపరాధి అని రుజువైతే ఆయనను ముఖ్యమంత్రి చేసుకోండి అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర సవాల్‌ విసిరారు. నగరంలో బీజేపీ ప్రధాన ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. ఈడీ చార్జిషీట్‌లో నాగేంద్ర పేరు ఉందని, శివమొగ్గలో మండలి అధికారి చంద్రశేఖర్‌ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. డెత్‌నోట్‌లో అప్పటి మంత్రి బీ.నాగేంద్ర ఆదేశాలతో నగదును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసినట్లు రాశారన్నారు. ఇలాంటి అవినీతిపరులను కొనసాగించరాదని, మంత్రి పదవి నుంచి తక్షణం తప్పించాలని డిమాండ్‌ చేశారు. నాగేంద్ర చాలా చిన్న చేప మాత్రమే, పెద్ద చేపలు, తిమింగళాలు ఈ స్కాంలో ఉన్నాయన్నారు. వీరందరిపై పోరాటానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement