మైసూరు: గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల జీవితంలో సాధన, సన్మార్గం లభిస్తాయని ముడా అధ్యక్షుడు హెచ్‌వీ రాజీవ్ పేర్కొన్నారు. బుధవారం కేఆర్ మొహల్లా కేఎన్ అగ్రహారలోని హళెనాడు సోసలె కర్ణాటక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సామూహిక రుగ్వేద ఉపాకర్మ ఆచరణ జరిగింది. గాయత్రి మంత్రం అత్యంత ప్రభావవంతమైంది. తేజస్సు, మేధోశక్తి, చిత్తాన్ని పావనం చేసేదే గాయత్రి మంత్రం అన్నారు. గాయత్రి మంత్రంతో ఉత్తమ సంస్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో విప్ర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇష్టానుసారం అరెస్టు చేస్తారా?
● ఖాకీలపై హైకోర్టు ఆగ్రహం
దొడ్డబళ్లాపురం: విచారణకు రావాలని తేదీ ఇచ్చి, ముందు రోజే అరెస్టు చేసిన వైట్‌ఫీల్డ్ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎవరినైనా అరెస్టు చేయడం అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా అరెస్టు చేశారని బాధిత వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న.. పోలీసులు చట్ట విరుద్ధంగా చేస్తున్న అరెస్టులను కోర్టు గమనిస్తోందని, అందులో ఇది కూడా ఒకటి పేర్కొన్నారు. దర్యాప్తుకు సహకరించాలని నోటీసు ఇచ్చాక ఆ వ్యక్తి సహకరించకపోతే మాత్రమే అరెస్టు చేయాలని, ఇష్టానుసారంగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించింది. ఆగస్టు 27న విచారణకు రమ్మని నోటీసు ఇచ్చి 25న నిర్బంధించడం సరికాదని స్పష్టంచేశారు. ఇది ఒకరి స్వాతంత్య్రాన్ని హరించడమన్నారు. సదరు పోలీస్ అధికారి స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని, లేదంటే భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని తెలిపారు.
ముగిసిన గిరిజన సమ్మేళనం
మైసూరు: గిరిజన భాషలు, వస్తు సంగ్రహాలయాలపై మైసూరులో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సమ్మేళనం విజయవంతమైందని ఎస్టీ వర్గాల సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ అశోక్ తెలిపారు. నగరంలోని హోటల్‌లో ఈ వేడుక జరిగింది. గిరిజన పరిశోధన సంస్థలు చేపట్టాల్సిన అధ్యయనాల గురించి చర్చించారు. దేశంలోని 23 రాష్ట్రాల నుంచి 52 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
కరుణించరావా వైష్ణోదేవి
బొమ్మనహళ్లి: బెంగళూరులోని బొమ్మనహళ్ళి నియోజకవర్గం బన్నేరుఘట్ట రోడ్డులో హులిమావులో వెలసిన శ్రీవైష్ణోదేవి ఆలయ 27వ వార్షికోత్సవ పూజా వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఎం.సతీష్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. పురుషోత్తం, మురళిధర్, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.


