మైసూరు: మైసూరు దసరా మహోత్సవాలలో పాల్గొనే గజరాజులు సుమారు 2 నెలలు ముందుగానే అంగరంగ వైభవంగా ప్యాలెస్ సిటీలో అడుగుపెట్టాయి. జిల్లాలోని హుణసూరు తాలూకాలోని నాగరహోళె అడవులకు గడప వంటి వీరనహొసహళ్లిలో బుధవారం గజ పయనం సంబరం అట్టహాసంగా జరిగింది. పవిత్రమైన తులా లగ్నంలో ఉదయం 10 నుంచి 10:28 గంటల మధ్య దసరా వేడుకలలో పాల్గొనే 9 ఏనుగులకు ఘన స్వాగతం పలికారు. జిల్లా మంత్రి యతీంద్ర సిద్దరామయ్య ఏనుగులకు పూలమాలలు వేసి పూజలు చేశారు. ఏనుగులు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ముందుకు నడిచాయి. దసరా ఉత్సవాలలో వైమానిక ప్రదర్శన ఉండేలా చూస్తామని మంత్రి తెలిపారు. మైసూరు దసరాకు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది, మన సంస్కృతి, కళ, సాహిత్యాన్ని ప్రతిబింబించే పండుగ అని చెప్పారు.
9 గజరాజులు..
ఈ సందర్భంగా 15కు పైగా కళా బృందాల ప్రదర్శనలు కోలాహలం నింపాయి. 170 మంది మహిళలు కలశాలను పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. గజరాజులు మహేంద్ర, శ్రీకంఠ, లక్ష్మి, ఏకలవ్య, ధనంజయ, గోపి, కావేరి, ప్రశాంత్, శ్రీరామ అనే 9 ఏనుగులను చూడడానికి వేలాదిగా జనం వచ్చారు. కొంతదూరం ఊరేగింపు సాగిన తరువాత ఏనుగులను, మావటీలను లారీలలో ఎక్కించి మైసూరుకు తీసుకెళ్లారు.
అభిమన్యుకు ఘన వీడ్కోలు
గత 25 ఏళ్లలో మైసూరు వేడుకల్లో పాల్గొంటూ, ఆరుసార్లు అమ్మవారి బంగారు అంబారీని మోసిన గజరాజు కెప్టెన్ అభిమన్యు (60) ఈ సందర్భంగా రిటైరైంది. మంత్రి, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమన్యుడు నడుస్తుండగా పూల వర్షం కురిపించి ఆప్యాయంగా వీడ్కోలు పలికారు. రౌడీ ఏనుగులను పట్టుకోవడంలో కూడా అభిమన్యు పేరుపొందింది.
అడవుల నుంచి రాచనగరానికి
మైసూరు దసరా ఏర్పాట్లు షురూ


