మండ్య/ యశవంతపుర: శుక్రవారం వర మహాలక్ష్మీ పర్వదినం కావడంతో గురువారం మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. పండుగ కోసం పూలు పండ్లు, మిఠాయిలు తదితర వస్తుసామగ్రి కోసం మహిళలు భారీగా కొనుగోళ్లు జరిపారు. బెంగళూరు సిటీ మార్కెట్ ప్రాంతం ఇసుకేస్తే రాలనంతగా కిటకిటలాడింది. పూలు, పండ్ల ధరలు భగ్గుమన్నాయి. కనకాంబరాలు కేజీ రూ.5 వేలు పలికాయి. మల్లెలు కేజీ రూ.1000, చెండుపూలు కేజీ రూ.350, కాగడాలు రూ.400 కు విక్రయించారు. పూలహారాలు రూ.12 వందల నుంచి రూ.15 వేల వరకూ అమ్మారు. అయినప్పటికీ మహిళలు సిరుల తల్లి పూజల కోసం శక్తిమేరకు కొనుగోలు చేశారు.
వెండి ముఖాలకు గిరాకీ
మండ్యలో మార్కెట్లలో రద్దీ నెలకొంది. ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి నానా నైవేద్యాలతో పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిరోజుల నుంచే ఇళ్లలో రకరకాల చిరుతిళ్లు, వంటకాలు తయారు చేశారు. నగరంలో పేట వీధి, వి.వి. రోడ్, మహావీర్ సర్కిల్ తదితరాలలో పూలు, పండ్లు, అరటిపండ్లు, తామర పువ్వుల వ్యాపారం జోరుగా సాగుతోంది. వెండి వరమహాలక్ష్మి ముఖాలకు విపరీతమైన గిరాకీ ఉంది. నగల షాపుల్లో అమ్మవారి ముఖాలను విక్రయించారు. మహిళలు కొనుగోలు చేసి నుదుటిపై ఎర్రరాళ్లతో, బంగారు ముక్కు పుడకలతో సింగారించి తీసుకెళ్లారు. గతంలోనే కొన్నవారు షాపులకు వచ్చి పాలిష్ పెట్టించారు. అంత స్తోమత లేనివారు మట్టితో చేసిన అమ్మవారి బొమ్మలను కొన్నారు. కొబ్బరికాయలకు కూడా అమ్మవారి రూపాన్ని అలంకరించి వ్రతం ఆచరిస్తారు.
వర మహాలక్ష్మి పర్వదినం రాకతో గిరాకీ
బెంగళూరు మార్కెట్లు కిటకిట


