బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని సుప్రసిద్ధ శ్రావణ బెళగొళలో 23వ తీర్థంకర భ్రమణ మోక్షం కోసం గురువారం అర్చకులు అభినవ చారుకీర్తి భట్టారక స్వామీజీ ఆధ్వర్యంలో అంతరాలయ పార్శ్వనాథ స్వామికి అభిషేకం నిర్వహించారు. కొబ్బరి నీరు, చెరకు రసం, పాలు, పసుపు, చందనం, అష్టగంధంతో శిరోభిషేకం నిర్వహించారు. చంద్రగిరి కొండపై పార్శ్వనాథ స్వామి వారి బసదులన్నింటిలో విశేష పూజలు నిర్వహించారు. జైన సాధువులు, భక్తులు పాల్గొన్నారు.
ఆ అధికారికి వందెకరాలు!
యశవంతపుర: అవినీతి ఆరోపణలు రావడంతో ప్రత్యేక భూ స్వాధీనం అధికారి మల్లికార్జున ఇల్లు, ఆఫీసులపై లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. 11 చోట్ల సోదాలు నిర్వహించగా రూ.12.95 కోట్ల విలువగల అక్రమ ఆస్తులు బయట పడ్డాయి. ఏకంగా నూరు ఎకరాల పొలాలు, చరాస్తులు ఇందులో ఉన్నాయి. ఆయన ఇంటి నుంచి రూ.2.53 కోట్ల నగదు, రూ.3.10 కోట్ల బంగారం, రూ.15 లక్షలు విలువగల వాహనాలు, రూ.కోటి బ్యాంక్ బ్యాలెన్స్ ను సీజ్ చేశారు. రూ.33.40 లక్షల విలువైన ఫర్నిచర్, వస్తువులను సీజ్ చేసినట్లు లోకాయుక్త తెలిపింది.
కన్నతల్లి కిరాతకం..
● పసిబిడ్డను చంపి, ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాలతో విరక్తి చెంది.. కన్నకొడుకును చంపి, తరువాత తల్లి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన హాసన్‌లోని ఆలూరు హౌసింగ్ బోర్డులో జరిగింది. వివరాలు.. అనుపమ (27), శ్రీనివాస్ దంపతులకు, కుమారుడు ఆర్యన్ (2) ఉన్నాడు. ఆలూరు తాలూకా సింగాపురకి చెందిన వీరు ప్రేమపెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస్ ఇంట్లో ఇది ఇష్టం లేదు. దంపతులు బెంగళూరుకు వెళ్లి పనిచేసుకుని జీవిస్తున్నారు. అయితే సింగాపుర గ్రామంలో శ్రీనివాస్ తల్లి జయమ్మ, ఈమె కుమార్తె అనుశ్రీ ఇద్దరూ అనుపమ కుటుంబాన్ని సూటిపోటి మాటలతో నిందిస్తూ వేధించేవారు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో బుధవారం సాయంత్రం అనుపమ ఇంట్లో కుమారునికి ఊపిరాడకుండా చేసి చంపి, తరువాత ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆలూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
జయ పాండురంగ విఠలా
బొమ్మనహళ్లి: చిక్కమగళూరు జిల్లా కడూరు సమీపంలో ఉన్న బీరూర్ కరగల్ వీధిలోని శ్రీ పాండురంగ రఘుమాయి ఆలయ నూతన గోపుర కలశారోహణ, దిండి ఉత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం, ధ్వజారోహణం హోమం నిర్వహించారు. శ్రీ వీరభద్రస్వామి ఆలయం నుంచి మహిళలు గంగా కలశాన్ని తీసుకువచ్చారు. భావసార క్షత్రియ మహిళా మండలి వారిచే కూర్మ, విష్ణు పాదుకలను పూజించి సమర్పించారు. సాయంత్రం కలశ ప్రతిష్టాపన, క్షీరాభిషేకం, పుష్పాధివాసం నిర్వహించారు.


