హుబ్లీ: కెనరా బ్యాంక్ ఫైనాన్స్ కార్డు ఇప్పిస్తామంటూ నమ్మించి ధార్వాడకు చెందిన వ్యక్తి నుంచి రూ.1,46,500లను ఆన్‌లైన్ కేటుగాళ్లు వంచించారు. ధార్వాడకు చెందిన ఎన్.గంగప్ప బాధితుడు. మొబైల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ చూస్తుండగా వచ్చిన ఓ లింక్‌పై క్లిక్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కార్డు చేయిస్తామంటూ నమ్మించి బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకొని డబ్బులు బదలాయించుకొని వంచించారు. గంగప్ప నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మరో ఘటనలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ధార్వాడ తాలూకా మరడిగి గ్రామంలో ఓ రైతు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ద్యామన్న వీరప్ప హంపన్నవర(35) ఆత్మహత్య చేసుకున్న రైతు. మృతుడు పంటల సాగు కోసం శివళ్లి గ్రామ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ శాఖ నుంచి రూ.2 లక్షలతో పాటు మరికొన్ని చోట్ల కూడా అప్పు చేశాడు. ఈసారి ఖరీఫ్ పంట విఫలం కావడంతో కుంగిపోయిన ద్యామన్న గ్రామంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ధార్వాడ గ్రామీణ సీఐ శివానంద కమతగి తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
నలుగురు అదృశ్యం
హుబ్లీ: బెంగళూరుకు వెళ్లి వస్తామంటూ వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంటికి తిరిగి రాకుండా అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన దావణగెరె బనశంకరి లేఅవుట్‌లో చోటు చేసుకుంది. రమేష్‌కుమార్(38), ఆయన భార్య జయశీల(36), కుమారుడు హితేష్ (9), కుమార్తె ప్రేరణ (3) కనిపించకుండా పోయారని విద్యానగర పోలీసులు తెలిపారు. దావణగెరె తాలూకా శాగలే గ్రామ నివాసి అయిన రమేష్‌కుమార్ షేర్ల పెట్టుబడి వ్యాపారం చేసుకుంటూ దావణగెరెలో గత కొంత కాలంగా ఉండేవారు. ప్రజల నుంచి డబ్బులు సేకరించి రమేష్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇటీవల షేర్ మార్కెట్‌లో నష్టాలు వాటిల్లాయని ఆ కుటుంబ సభ్యులు చెప్పేవారు. ఈ నెల 12న తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెంగళూరుకు వెళ్లి వస్తామంటూ చెప్పిన రమేష్ కుటుంబ సభ్యులు కారు, మొబైల్, బైక్‌ను ఇంట్లోనే వదిలి ఆటోలో ఆర్‌టీసీ బస్టాండ్‌కు వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆచూకీ లేకుండా పోవడంతో రమేష్ బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. మొబైల్ కూడా విడిచి వెళ్లడం, బంధువుల ఇళ్లకు కూడా వెళ్లలేదన్న సమాచారంతో మరింత ఆందోళన చెందారు. ఘటనపై కుటుంబ సభ్యులు విద్యానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని రమేష్‌కుమార్ కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నట్లు విద్యానగర్ సీఐ శిల్ప మీడియాకు తెలిపారు. బెంగళూరుకు వెళుతున్నామని రమేష్ తన తల్లితో చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. కారు, మొబైల్ తదితరాలను ఇంట్లోనే వదిలి వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారని రమేష్ తల్లి ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తులో ఉందన్నారు.
అనర్హులకు ఇళ్లు, స్థలాల పంపిణీ
● తహసీల్దార్ కార్యాలయంలో లోకాయుక్త తనిఖీ
హుబ్లీ: వరద బాధితుల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు, ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు పంచకుండా ఇతరులకు అక్రమంగా పంపిణీ చేశారన్న ఆరోపణలపై లోకాయుక్త అధికారులు బాదామి తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేసి సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. 2009లో సంభవించిన అతివృష్టి, మలప్రభ నది వరదలతో బాదామి తాలూకా తమినాళ గ్రామం కొన్ని కుటుంబాలు ఇళ్లు, ఆస్తులను కోల్పోయి వీధిన పడ్డాయి. వరద బాధితుల పునర్వసతి కోసం చేపట్టిన కార్యక్రమంలో నిజమైన 38 మంది బాధితులను వదిలేశారు. అందుకు బదులుగా నియమాలను తుంగలో తొక్కి బాధితులు కానీ 62 మంది కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయాలపై అర్హులైన లబ్ధిదారులు లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.
దొరికిన మరో
యువకుడి మృతదేహం
● ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం
● కొనసాగుతున్న మరొకరి కోసం గాలింపు
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా తంబ్రహళ్లి గ్రామ సమీపంలో మంగళవారం తుంగభద్ర పోటు జలాల్లో చేపలు పట్టడానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన సంగతి విదితమే. వీరిలో బుధవారం ఓ యువకుడి మృతదేహం లభించగా, గురువారం ఉదయం మరో యువకుడి మృతదేహం దొరికింది. ఇంకా లభించని ఇంకో యువకుడి మృతదేహం కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ గాలింపు కొనసాగిస్తోంది. మృతుల్లో గ్రామానికి చెందిన యమనూరు (26), రాజు(22) అనే అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందిన చంద్రప్ప, లక్ష్మమ్మల సంతానం కావడం విశేషం.


