మైసూరు: ప్రశాంతంగా ఉన్న అడవుల్లో తుపాకుల గర్జనలు ప్రకంపనలు సృష్టించాయి. ఇది డీకే శివకుమార్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని కావేరీ అభయారణ్యంలో షగ్యా జోన్‌లో అటవీ అధికారులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు స్థానికులు మరణించడం సంచలనమైంది. శనివారం తెల్లవారుజామున సంఘటన జరగ్గా అప్పటినుంచి హనూరులో మృతులు కుటుంబాలు, గ్రామస్తులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మొదట్లో అటవీ కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.
నిద్రిస్తుంటే కాల్చేశారు: భార్య
మృతుల్లో ఒకరైన తోమియార్ పాళ్యవాసి ఆంథోనిస్వామి భార్య లూర్ద మేరీ అటవీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి బండరాయి దగ్గర నిద్రిస్తున్న తన భర్త, మిగతావారిపై అటవీ సిబ్బంది కాల్పులు జరిపి చంపారని ఆరోపించారు. 14న సాయంత్రం అడవిలో మేతకు వదిలిన పశువులలో రెండు ఆవులు ఇంటికి తిరిగి రాలేదని, వాటిని వెతుకుతూ వెళ్లారని తెలిపింది. తెల్లవారుజామున సుమారు 5 గంటలకు, నిద్రపోతున్న తమ ముగ్గురిపై అటవీ సిబ్బంది కాల్పులు జరపడంతో వారందరూ అక్కడికక్కడే మరణించారని, తాను అక్కడి నుంచి పారిపోయానని వారి బంధువు మహిమ దాస్ తెలిపాడు. అటవీ సిబ్బందిపై తాను కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఫిర్యాదులో అటవీ సిబ్బంది పేర్లను తెలుపలేదు.
వేటగాళ్లు ఖతం: అటవీశాఖ
అటవీ సిబ్బంది జరిపిన ఆపరేషన్‌లో ముగ్గురు వేటగాళ్లు మరణించారని అటవీ శాఖ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. మరో నిందితుడు అడవిలో దాక్కున్నాడని తెలిపింది. చిక్కలూరు రిజర్వ్ ఫారెస్ట్‌లోకి తుపాకులతో వేటగాళ్లు ప్రవేశించి వన్యప్రాణులను వేటాడుతున్నారని సమాచారం రావడంతో సిబ్బంది గాలించారు. ఆగస్టు 15న, ఉదయం 5 నుంచి 5:30 గంటల మధ్య, రాళ్లు, పొదల మధ్య దాక్కున్న వేటగాళ్లు అకస్మాత్తుగా అటవీ సిబ్బందిపై దాడి చేశారని, లొంగిపోమని ఆదేశించినప్పటికీ నిందితులు రైఫిల్‌తో దాడి చేయడానికి ప్రయత్నించడంతో, సిబ్బంది ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని అటవీ శాఖ తెలిపింది. గాయపడిన ముగ్గురిని వెంటనే కొల్లేగాళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ముగ్గురూ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు, తరువాత మృతదేహాలను మైసూరులోని కె.ఆర్. ఆసుపత్రికి తరలించామని ప్రకటనలో తెలిపారు. ఆత్మరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ కోసం అటవీ సిబ్బంది కాల్పులు జరిపినట్లు కావేరి అభయారణ్యం డీసీఎఫ్ ప్రకటించారు.
మృతుల వివరాలు
● ఆంథోనిస్వామి (50), మారిమంగళ గ్రామ నివాసి, రైతు
● జాన్‌రోజ్ పీటర్ (42), జగన్నాథదొడ్డి గ్రామ నివాసి, రైతు
● కుమార్ (33), లసర్దొడ్డి గ్రామ నివాసి, హిటాచీ ఆపరేటర్
● పరారీలో ఉన్న నిందితుడు: మహిమ దాస్ (45)
మాంసం, పాత్రలు, తుపాకులు దొరికాయి
అటవీ అధికారులు సంఘటనా స్థలం నుంచి రెండు రైఫిళ్లు, 20 కిలోల జంతు మాంసం, తూటాలు, గన్‌పౌడర్, కత్తి, మొబైల్ ఫోన్లు, బ్యాటరీ, చార్జర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ తెలిపింది. అలాగే వంట పాత్రలు, ఉప్పు, పప్పు దినుసులు లభించాయన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఎన్‌కౌంటర్ ఘటన సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర రభస సృష్టిస్తుందని తెలుస్తోంది.
కుటుంబాలతో ఎమ్మెల్యే చర్చలు సఫలం
మైసూరు: మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారమిస్తామని హనూరు ఎమ్మెల్యే ఎం.ఆర్. మంజునాథ్ ప్రకటించి, నిరసనకారులను ఒప్పించారు. ఆగ్రహంతో నిరసన చేస్తున్న కుటుంబ సభ్యులు, తోమియార్ పాళ్య చుట్టుపక్కల గ్రామస్తులు పోరాటాన్ని విరమించుకున్నారు. ఎమ్మెల్యే ఆదివారం ధర్నాస్థలికి వచ్చి వారితో చర్చించారు. ప్రభుత్వం దోషులైన అధికారులను సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం రూ. 5 లక్షల తాత్కాలిక పరిహారాన్ని ప్రకటించింది, తాను మరో రూ.10 లక్షలు ఇస్తానని తెలిపారు. అటవీ సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది, దర్యాప్తులో నిజం తెలుస్తుందన్నారు. ఆందోళన విరమణతో హనూరు పట్టణంలో జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. అయితే నివురుగప్పిన నిప్పులా ఉంది.
మెజిస్టీరియల్ విచారణ
చామరాజనగర జిల్లాలో
ముగ్గురి మృతి ఘటన..
అటవీ సిబ్బందిపై మృతుల బంధువుల ఫిర్యాదు
వారు వేటగాళ్లేనని అటవీశాఖ ప్రకటన
హనూరులో ధర్నాలతో ఉద్రిక్తత
మైసూరు: కాల్పుల దుర్ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు చామరాజనగర జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొల్లేగాల సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ మీనా నేతృత్వంలో విచారణ జరిపించి, 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. తాను సంఘటనా స్థలాన్ని సందర్శించి మహాజరు నిర్వహించానని మీనా తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి నివేదికను సమర్పిస్తామని చెప్పారు. దక్షిణ జోన్ ఐజీపీ డా.బోరలింగయ్య శనివారం నుంచి హనూరులో మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం చామరాజనగర ఎస్పీ ముత్తురాజ్, మైసూరు ఎస్పీ మల్లికార్జున బాలదండి, సబ్ కలెక్టర్‌తో సమావేశమయ్యారు. దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీస్తామని బోరలింగయ్య తెలిపారు. ఆంథోనిస్వామి భార్య లూర్దా మేరీ అటవీ అధికారులపై ఫిర్యాదు చేశారని, వారు నిద్రిస్తుండగా వారిపై కాల్పులు జరిపారని తెలిపారన్నారు. ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు జరిపినట్లు అటవీ సిబ్బంది చెప్పారన్నారు.
రాకపోకలు ప్రారంభం
ఆందోళన వల్ల మలే మహదేశ్వర బెట్టకు వెళ్లే రోడ్డు మార్గం శనివారం ఉదయం నుంచి బందయ్యింది. పోలీసులు నిరసనకారులను శాంతింపజేసి, ఆదివారం ఉదయం నుంచి రోడ్డుకు ఒక వైపున వాహనాల రాకపోకలకు అనుమతించారు. భారీగా పోలీసులు మోహరించారు.


