దొడ్డబళ్లాపురం: బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో యువ జంట అక్కడే దుర్మరణం పాలైంది. ఈ సంఘటన చిక్కబళ్లాపురం తాలూకా లింగశెట్టిపుర గేట్ వద్ద జరిగింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన యువతీ యువకుడు ఆదివారంనాడు బెంగళూరు నుంచి బైక్‌పై చిక్కబళ్లాపురంలోని ఈశా ఆదియోగి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా లింగశెట్టిపుర గేట్ వద్ద లారీ ఢీకొట్టింది, దీంతో ఇద్దరూ రక్తపు మడుగులో మరణించారు. చిక్కబళ్లాపురం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
4వ అంతస్తు నుంచి
పడిన బాలిక
బనశంకరి: ఎత్తైన భవనాల్లో ఉండే కుటుంబాల తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలు కిందపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 4వ అంతస్తుపై నుంచి పడిపోయిన చిన్నారి బాలిక తీవ్రంగా గాయపడింది. వివరాలు.. మడివాళ పోలీస్‌స్టేషన్ పరిదిలోని ఆడుగోడిలో శనివారం ఉదయం 10.50 సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో పనిలో ఉన్నారు. బాలిక బాల్కనీలో ఆడుకుంటూ గ్రిల్ మీద నుంచి కిందకు పడిపోయింది. ఈ భయానక దృశ్యం సీసీ కెమెరాలలో నిక్షిప్తమైంది. కిందపడిన చిన్నారిని స్థానికులు బైకులో కోరమంగల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య ఉంది. మడివాళ పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రులను ప్రశ్నించారు.
18వ అంతస్తు నుంచి పడి...
బనశంకరి: అపార్టుమెంటు 18వ అంతస్తు నుంచి కిందపడి వృద్ధుడు చనిపోయాడు. ఈ ఘటన ఆదివారం బెంగళూరు కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పరమేశ్వర్ (72) తన చెల్లెలు నివసించే 18వ ఫ్లోర్‌లోని ఫ్లాట్‌కు వెళ్లాడు. ఏం జరిగిందో కానీ పై నుంచి కిందపడడంతో తీవ్రగాయాలై మరణించాడు. కేపీ అగ్రహార పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్య, ప్రమాదమా, ఆత్మహత్యా? అనేది తేలాల్సి ఉంది.
సోనియాగాంధీపై ఫిర్యాదు
యశవంతపుర: వందే మాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ మీద దక్షిణ కన్నడలో మంగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు వికాస్ స్థానిక ఉర్వ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సోనియాగాంధీ మీద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. లేదంటే హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తానన్నాడు.
కుమార నైస్ లేఖపై సీఎం స్పందన
శివాజీనగర: నైస్ రోడ్డు సమస్యలపై కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి రాసిన లేఖపై స్పందిస్తూ, తాను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని సీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. నైస్ రోడ్డులో అక్రమంగా వసూలు చేస్తున్న టోల్ ఫీజులను తక్షణమే అడ్డుకోవాలని కుమారస్వామి లేఖ రాశారు. అలాగే రోడ్డు నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చి 23 ఏళ్లు గడచినా ఇంకా పరిహారం ఇవ్వలేదని తెలిపారు. అనేక రకాల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని కోరారు. ఆ లేఖను తాను ఇంకా చూడలేదని, చూసిన తరువాత ఏం చేయవచ్చో చూస్తానని చెప్పారు.
సంద్రంలో పడవ ప్రమాదం
యశవంతపుర: గోకర్ణకు సమీపంలో తగడి వద్ద ఆదివారం అరేబియా సముద్రంలో మత్స్యకారుల పడవ సముద్రంలో మునిగింది. అఘనాశిని నది సముద్రంలో సంగమించే చోట ప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద అలలు రావడంతో సగం మునిగింది. వారు మొబైల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఇతర జాలర్లు పడవలలో వచ్చి కాపాడారు. తరువాత గోకర్ణ ప్రాథమిక అరోగ్య కేంద్రానికి తరలించారు. మునిగిపోతున్న పడవను మరో పడవ సాయంతో ఒడ్డుకు తెచ్చారు.


