హొసపేటె: విజయనగర జిల్లాలోని హులికెరె క్రాస్ వద్ద జాతీయ రహదారి– 50పై బుధవారం సాయంత్రం రోడ్డు దాటుతున్న బైక్‌ను కారు ఢీకొనడంతో బైకిస్టు అక్కడికక్కడే మరణించిన ఘటన జరిగింది. మృతుడిని ఓబళాపుర గ్రామానికి చెందిన ఉమేష్ (55)గా గుర్తించారు. అతను స్వంత పని మీద తన బైక్‌పై హులికెరెకు వెళ్లి, అక్కడి నుంచి తిరిగి వస్తూ హైవేని దాటుతుండగా కూడ్లిగి నుంచి చిత్రదుర్గ వైపు వెళ్తున్న సమీర్ అనే కారు డ్రైవర్ అతివేగంగా కారును నడుపుతూ నిర్లక్ష్యంగా దూసుకొచ్చి బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు ఉమేష్ రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి ఎగిరి పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందిన వెంటనే హొసహళ్లి ఏఎస్‌ఐ జిలాన్, హైవే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉమేష్ మృతదేహానికి జగళూరు ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు.
హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయండి
రాయచూరు రూరల్: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు ఎస్.మారెప్ప డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల క్రితం దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హద్దినాళ వద్ద బీఎస్పీ, దళిత సంఘం కార్యకర్త భూమానందపై గొడ్డలితో దాడి చేసి చంపిన కేసులో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న అరకొరగా మాత్రమే నిందితులను అరెస్ట్ చేశారన్నారు. పలు సంఘాలు నిందితులకు మద్దతు తెలపడాన్ని ఖండించారు. రవీంద్రనాథ్, విశ్వనాథ్, నరసింహులు, శివకుమార్, బేరి, అంబన్న, హేమరాజ్‌లున్నారు.
గ్రంథాలయ
పితామహుడికి నివాళి
రాయచూరు రూరల్: దేశంలో గ్రంథాలయాలకు పితామహుడు రంగనాథన్ అని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారిణి జాగృతి దేశ్‌మానె పేర్కొన్నారు. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం అంబేడ్కర్ భవనంలో జరిగిన జాతీయ గ్రంథపాలకుల దినోత్సవంలో ఆమె మాట్లాడారు. గ్రంథాలయం ఒక భండాగారం లాంటిదని, వాటి నిర్వహణలో ఆయన చూపిన చొరవ వల్ల నేడు పలు ప్రాంతాల్లో గ్రంథాల యాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు.
శిలా మూర్తులకు పూజలు
రాయచూరు రూరల్: శ్రావణ మాసం సందర్భంగా శంకర లింగేశ్వర ఆలయంలో నూతన శిలా మూర్తులకు లక్ష్మి పూజలను నెరవేర్చారు. గురువారం మంగళవార పేటెలో వెలసిన దేవాలయంలో కిల్లె బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, సోమవార పేటె మఠాధిపతి అభినవ రాచోటి వీర శివాచార్య ప్రత్యేక పూజలు చేపట్టారు. అభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, మహా మంగళ హారతిలను నెరవేర్చారు. కార్యక్రమంలో నరసప్ప, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
లాకప్‌డెత్‌పై సుమోటో కేసు
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లిలోని మహబూబ్‌నగర్‌కు చెందిన ఖలీలుల్లా (38) అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో పోలీసుల శారీరక హింస కారణంగా 10 రోజుల క్రితం మరణించిన ఘటనపై కర్ణాటక రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ తీవ్రంగా పరిగణించి సుమోటో కేసు నమోదు చేశారు. హగరిబొమ్మనహళ్లిలో లాకప్ మృతి కేసును తీవ్రంగా పరిగణిస్తూ అథారిటీ సుమోటోగా కేసు నమోదు చేసి తమకు సమగ్ర నివేదిక సమర్పించాలని విజయనగర జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది.


