సాక్షి,బళ్లారి: ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించిన పరమ పవిత్రమైన పుణ్యదినమని, ఆ రోజున ప్రతి ఇంటా ప్రతి ఒక్కరు జాతీయ జెండాను ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా గురువారం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. శ్రీకనక దుర్గమ్మ ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తమ దేశభక్తిని చాటారు. నగర వీధుల గుండా ర్యాలీ చేపట్టడంతో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని, జాతీయ ఐక్యతా భావనను పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా, కార్పొరేటర్ హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: నగరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీకి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. గురువారం రాయచూరు శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ నగరంలోని వీరాంజనేయ కళ్యాణ మంటపం వద్ద నుంచి ప్రారంభమై నగరంలోని పలు వీధుల గుండా పర్యటించి జాగృతిని కల్గించారు.
త్రివర్ణ పతాకంతో కవాతు
హుబ్లీ: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిన్మయ జూనియర్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ శాఖ, నక్షత్ర టెక్నాలజీ అండ్ అంభారతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 150 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఆర్భాటకంగా ఆవిష్కరించారు. చిన్మయ కళాశాల ఆవరణ నుంచి ప్రారంభమైన కవాతు రమేష్ భవన, సర్వోదయ సర్కిల్ మీదుగా రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వరకు సాగింది. జాజ్ మేళా, విద్యార్థుల అడుగుల సవ్వడి కవాతును మరింత రక్తి కట్టించింది. కాలేజీ ముఖ్యస్థులు స్వామి కృతాత్మానంద మాట్లాడుతూ ఇంటింటా స్వాతంత్య్ర దినాన్ని ఆచరించడం వల్ల పిల్లల్లో దేశభక్తిని రగిలించాలన్నారు. అందుకే గత 16 ఏళ్లుగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అంభారతీ ఫౌండేషన్ అధ్యక్షుడు అన్వర్ ముల్లా, కళాశాల ప్రిన్సిపాల్ శర్మిలీనాయుడు, సంబంధిత ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ పతాకాలు చేతబూని ఊరేగింపు
సంతోషంగా పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు


