కర్ణాటక బంద్‌కు స్పందన అంతంతే | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక బంద్‌కు స్పందన అంతంతే

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

హొసపేటె: కావేరి నదీ జలాల పంపిణీ వివాదం నేపథ్యంలో కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాల్‌ నాగరాజ్‌ గురువారం పిలుపునిచ్చిన కర్ణాటక బంద్‌కు విజయనగర జిల్లాలో అంతంత మాత్రపు స్పందనే లభించింది. విజయనగర జిల్లాలోని కన్నడ అనుకూల సంస్థలు కర్ణాటక బంద్‌కు కేవలం నైతిక మద్దతు మాత్రమే తెలిపాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో సాధారణ పరిస్థితి నెలకొంది. విజయనగర జిల్లాలోని హొసపేటె, కూడ్లిగి, కొట్టూరు, హగరిబొమ్మనహళ్లి, హడగలి, హరపనహళ్లి తాలూకాల్లో జనజీవనం సాధారణంగా ఉంది. బస్సులు, ఆటోలు, టాక్సీలు యథావిధిగా తిరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మామూలుగానే పని చేశాయి. కిరాణి, వస్త్ర దుకాణాలు, హోటళ్లు, షాపింగ్‌ మాల్‌లు కూడా ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. జిల్లా కేంద్రం హొసపేటె నగరానికి గురువారం వారపు సంత సెలవు కావడంతో వ్యాపార లావాదేవీలు మందగించాయి. జిల్లాపై బంద్‌ వేడి ఎలాంటి ప్రభావం చూపలేదు. ముందు జాగ్రత్తగా జిల్లా ఎస్పీ ఎస్‌.జాహ్నవి మార్గదర్శకత్వంలో డీఎస్పీ పీ.మురళీధర్‌ నేతృత్వంలో పోలీసులు నగరంలోని డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ సర్కిల్‌, డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సర్కిల్‌, సెంట్రల్‌ బస్టాండ్‌తో సహా ప్రధాన కూడళ్లు, రోడ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement