బళ్లారిఅర్బన్: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన 77 ఏళ్ల వృద్ధుడు నాగేశ్వరరావు (సాయిరామ్)కు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ పురుషుల హిత రక్షణ సమితి ఆధ్వర్యంలో న్యాయ పోరాటం ప్రారంభమైంది. నాగేశ్వరరావు సమస్యను పరిష్కరించేందుకు సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు రజనీ రాజ్, బళ్లారి జిల్లా అధ్యక్షుడు, విశ్రాంత ఎస్‌బీఐ ఉద్యోగి రామకృష్ణ, బళ్లారి నాయకుడు ఆర్.మనోహర్ తదితరులు కలిసి సంబంధిత అధికారులను సంప్రదించారు. అనంతపురం జిల్లా న్యాయమూర్తి, అనంతపురం ఐజీపీ, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీలను కలిసి నాగేశ్వరరావుకు న్యాయం, రక్షణ కల్పించాలని వినతిపత్రాలు సమర్పించారు.
వృద్ధాశ్రమంలో ఆశ్రయం
కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టిన వృద్ధుడు నాగేశ్వరరావు వేరుశెనగ వ్యాపారం నిర్వహించి సొంత ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. తన ఇద్దరు కుమారులను చదివించి, ఉద్యోగాలు ఇప్పించి, వివాహాలు కూడా జరిపించానని, అయితే వృద్ధాప్యంలో తన సొంత కుమారులే తనను ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లుగా ఆశ్రమాలు, దాతలు, దయగల వ్యక్తుల సహాయంతో జీవనం సాగిస్తున్నానని, తన సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులను ఆశ్రయించినా ఇప్పటి వరకు తగిన న్యాయం లభించలేదని నాగేశ్వరరావు తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం బళ్లారి లోని బృందావన కాలనీలో నివసిస్తున్న ఆర్.మనోహర్ నాగేశ్వరరావును అనాథ వృద్ధుడిగా కాకుండా తన తండ్రిలా ఆదరిస్తున్నారు. నాగేశ్వరరావును ఇంటి నుంచి బయటకు పంపిన ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుని, వృద్ధుడికి న్యాయం కల్పించాలని అధికారులు కోరారు.
అనంతపురం ఐజీపీ, జిల్లా న్యాయమూర్తి, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీకి వినతిపత్రాలు


