బళ్లారిటౌన్: వాల్మీకి మండలి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టడం ఘోర తప్పిదం అని, ఆయన రాజీనామా చేయాలని, లేకుంటే పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ వైఎం సతీష్ పేర్కొన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై విధాన పరిషత్ పర్యవేక్షణంలో తొలుత ఈ అంశంపైనే చర్చ లేవనెత్తుతున్నట్లు తెలిపారు. అంతేగాక దీనిపై మంత్రి స్థానానికి రాజీనామా చేసేంత వరకు పోరాటాలు చేస్తామన్నారు. ఈడీ చార్జిషీట్‌లో నాగేంద్ర అవినీతికి పాల్పడినట్లు కేసు దాఖలైనందున కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మంత్రి స్థానం ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. వాల్మీకి మండలిలో అవినీతి జరిగినట్లు నాటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యే అంగీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సరికాదన్నారు. ఆయనకు మంత్రి మండలిలో స్థానం కల్పించాల్సిన అనివార్యత ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఒత్తిడి పడినందునే మంత్రి స్థానం కల్పించారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎస్టీ మోర్ఛా నాయకుడు ధరప్పనాయక్ మాట్లాడుతూ మంత్రి నాగేంద్రకు ఇంకా క్లీన్ చిట్ లభించలేదన్నారు. ఆయనకు మంత్రి స్థానం కేటాయించడం సరికాదన్నారు. బీజేపీ నేతలు మురారీ గౌడ, హెచ్.హనుమంతప్ప, బీకే.సుందర్, ఓబుళేసు, అడవి స్వామి, శ్రీనివాస్, గడ్డం తిమ్మప్ప, కే.రామకృష్ణ, బీ.రఘు, విజయలక్ష్మి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.


