హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి సమీపంలోని చిలకనహట్టి గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో వన్యప్రాణులు దాడి చేసి రైతులకు కలిగించిన పంట నష్టానికి పరిహారం కోరుతూ రైతులు కర్ణాటక రైతు సంఘంతో కలిసి బుధవారం చిలకనహట్టి అటవీ ఉప విభాగం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆందోళనకారులు మాట్లాడుతూ బోరుబావులు, ఇతర నీటి వనరుల కింద పండించిన పంటలపై వన్యప్రాణులు దాడి చేయడం వల్ల రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవరమని మహేష్ మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో వన్యప్రాణుల దాడి చేసి, సుమారు 400 ఎకరాల చెరకు, మొక్కజొన్న, జొన్న పంటలను ధ్వంసం చేశాయన్నారు. ఎకరాకు రూ.50 వేల పరిహారం ప్రకటించాలని, అడవి జంతువుల బెడద నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం సభ్యులు బసవరాజ్, శేకప్ప, పీ.నాగప్ప, లక్ష్మణ, రాజన్న, ఓబజ్జ, బీ.రామన్న, గాలెప్ప, సోమన్న, తమ్మన్న, బొమ్మన్న, శరణప్ప, నందిహళ్లి సురేష్, కవిరాజ్ తదితరులు ఉన్నారు.


