థార్‌ జీపు పల్టీలు, ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

థార్‌ జీపు పల్టీలు, ఇద్దరు మృతి

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

దొడ్డబళ్లాపురం: పుట్టినరోజు వేడుక చేసుకున్న మిత్రులకు సంతోషం ఎంతోసేపు మిగలలేదు. థార్‌ జీప్‌ బోల్తాపడడంతో ఇద్దరు చనిపోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన బెంగళూరు దగ్గర నెలమంగల తాలూకా కంబాళులో జరిగింది. మంగళవారం రాత్రి పవన్‌, దీపక్‌, మరో ముగ్గురు కలిసి మిత్రుని బర్త్‌డే విందులో పాల్గొని థార్‌ జీప్‌లో తిరిగి వస్తుండగా కంబాళు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది, వాహనం తుక్కుగా మారింది. పవన్‌, దీపక్‌ తీవ్ర గాయాలతో మృత్యువాత పడ్డారు. మిగతా ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతి వేగం వల్ల ప్రమాదం సంభవించినట్టు అనుమానిస్తున్నారు. దాబస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

డెలివరీ బాయ్‌ అతి

యశవంతపుర: బెంగళూరులో మద్యం మత్తులో డెలివరీ బాయ్‌ యువతి ఇంట్లో రచ్చ చేశాడు. బాధిత యువతి అనేరి ఠక్కర్‌ ఇన్‌స్టాలో వివరించింది. ఆమె ఒక్కరే ఉండగా డెలివరీ బాయ్‌ వచ్చాడు. ఆమెతో అతి ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు, మొబైల్‌లో చార్జింగ్‌ పెట్టుకుంటానని, ఇక్కడే ఉండి సిగరెట్‌ తాగుతానని ఆమెను ఒత్తిడి చేశాడు. ఇంట్లోకి చొరబడడానికి యత్నించాడని యువతి వాపోయింది. చివరకు ఎలాగో అతన్ని వెనక్కి పంపించినట్లు, అతడు పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తామని చెప్పారని పేర్కొంది.

ఇంటి నుంచే పని పేరుతో భారీగా మోసాలు

దొడ్డబళ్లాపురం: సోషల్‌ మీడియాలో అసత్యపు ప్రకటనలు ఇచ్చి అమాయకపు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మోసకారి దంపతులను దేవనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. చిక్కజాల నివాసులు కిరణ్‌ (28), ఆరతి (23) పట్టుబడ్డారు. ఇంట్లో కూర్చునే వేల రూపాయల్ని సంపాదించవచ్చని, పేపర్‌ ప్లేట్లు, అగరొత్తులు, క్యాండిల్స్‌ ప్యాకింగ్‌ చేస్తే డబ్బులు ఇస్తామని కార్మికాదేవి ఎంటర్‌ప్రైజస్‌ పేరుతో ఇంటర్నెట్‌లో జోరుగా ప్రకటనలు ఇచ్చారు. వాటిని చూసి కాల్‌ చేస్తే డిపాజిట్‌ చెల్లించాలని చెప్పి అందినంత వసూలు చేసుకునేవారు. ఇలా ఎంతోమంది నుంచి పెద్ద మొత్తాల్లో లాక్కున్నారు. వీరిపై దేవనహళ్లి, దొడ్డబళ్లాపురం, చిక్కజాల, యలహంక తదితర పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. దేవనహళ్లి పట్టణ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

విద్యార్థుల ఘర్షణ

యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లా మంగళూరు నగరంలో ప్రముఖ కాలేజీలో గొడవల వల్ల ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం గుజ్జరెకెరెలో కాలేజీ వద్ద టీస్టాల్‌లో సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులపై దాడి చేశారు, ఇందులో ఒకరి మెడ ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుమంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. అలాగే.. మరో కాలేజీలో విద్యార్థుల నుంచి 290 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని డ్రగ్స్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

బైక్‌ ట్యాక్సీల సీజ్‌

బెంగళూరులో రవాణాశాఖ దాడులు

బనశంకరి: రాజధానిలో బైక్‌ ట్యాక్సీ సేవలపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించి 70 బైకులను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌యాప్‌ల ద్వారా ట్రిప్పులు వేస్తున్న బైకిస్టులను అడ్డుకుని సీజ్‌ చేశారు. యలహంక సింగనాయకనహళ్లి ఆర్‌టీఓ పరిధిలో 40కి పైగా బైకులను జప్తు చేశారు. బైకిస్టుల మొబైల్స్‌ ను కూడా స్వాధీనం చేసుకుని రికార్డులు పరిశీలించారు. బైక్‌ ట్యాక్సీలను నిషేధించాలని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు ఆందోళనలు చేయడంతో పాటు హైకోర్టులో కేసులు వేయడం తెలిసిందే. దీంతో మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో రవాణాశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది.

డీఎల్‌, ఆర్‌సీ రద్దు చేస్తాం

అక్రమంగా బైకు ట్యాక్సీ నడుపుతున్న వారి డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల ఆర్‌సీ రద్దుచేస్తున్నామని అధికారులు తెలిపారు. రాజాజీనగరలో వాహనాలు జప్తుచేయడంతో ఆర్‌టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాపిడో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కావాలనే బైక్‌ ట్యాక్సీలను బుక్‌చేసి అధికారులకు తెలిపి పట్టిస్తున్నారని కొందరు యువకులు ఆరోపించారు. వారంపాటు తనిఖీలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement