రాయచూరు రూరల్: కర్మాగారంలో విషపూరిత గ్యాస్ లీక్ కాగా, దానికి పీల్చడంతో ముగ్గురు కార్మికులు మరణించిన ఘటన యాదగిరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గురుమిఠకల్ నియోజకవర్గంలోని కడేచూర్ బాడియాల పారిశ్రామికవాడలో సిల్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనే ఫార్మా ఫ్యాక్టరీ ఉంది. బుధవారం ఉదయం పైపుల నుంచి ప్రమాదకర గ్యాస్ లీకేజీ కాగా, విధుల్లో ఉన్న కార్మికులు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. తెలంగాణలోని మాగనూర్– అలంపల్లికి చెందిన కట్లా గణేష్ (23), మధ్యప్రదేశ్‌వాసులు విక్రంసింగ్ గోండా(25), సంజయ్‌సింగ్ గోండా (25) రసాయనం తీవ్రతకు మృత్యువాత పడ్డారు. ఏపీలో అనంతపురం సిండికేట్ నగర్‌కు చెందిన మంచాల హేమంత్ (23), అనంతపురం జిల్లా కూడేరు దగ్గర చోళసముద్రంవాసి మంచాల శివకుమార్ (25)లు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. తోటి కార్మికులు రాయచూరు ప్రభత్వ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేలు శరణేగౌడ కందకూర్, వేణుగోపాల్ నాయక్, దర్శనాపుర, జిల్లా కలెక్టర్ రావుల్ తుకారం పాండ్వే, జడ్పీ సిఇఓ లవీష్ ఒడెయార్, ఎస్పీ పృధ్వీ శంకర్‌లు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
ప్రమాదకర వాయువు లీకై
ముగ్గురు కార్మికులు మృతి
మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థత
బాధితుల్లో తెలంగాణ, ఏపీవాసులు
యాదగిరి జిల్లాలో సంఘటన


