రైతుల్లో చిగురించిన ఖరీఫ్‌ ఆశలు | - | Sakshi
Sakshi News home page

రైతుల్లో చిగురించిన ఖరీఫ్‌ ఆశలు

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

సాక్షి,బళ్లారి: ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి తుంగభద్ర డ్యాంలో నీరు చేరడం ఆలస్యం కావడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందారు. ఎల్‌నినో ప్రభావం కూడా ఉందని, డ్యాంలోకి నీరు చేరడం కష్టం అవుతుందని భావించి రైతులందరూ నిరుత్సాహంతో డీలా పడ్డారు. జూలై నెల దాటిన కూడా డ్యాంలో తగినంత నీరు చేరకపోవడంతో ఇక ఖరీఫ్‌కు క్రాప్‌హాలిడే ప్రకటిస్తారేమోనని ఆయకట్టు రైతులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే ఉన్నఫళంగా ఆగస్టు నెల ప్రారంభం నుంచి క్రమేణా తుంగభద్ర డ్యాంలోకి వరద వెల్లువెత్తడంతో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. తుంగభద్ర డ్యాంకు ఎగువన ఆగుంబె, మోరాళ, తీర్థహళ్లి, శివమొగ్గ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో తుంగా డ్యాం పూర్తిగా నిండిపోయి దిగువకు నీటి ప్రవాహం పెరిగి పోయింది. ప్రస్తుతం డ్యాంలోకి ఇన్‌ఫ్లో రూపంలో లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతుండటంతో డ్యాంలో నీటి నిల్వ 60 టీఎంసీలకు పైగా చేరింది.

ఖరీఫ్‌లో పంటల సాగుకు ఢోకా లేనట్లే..

ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేయడానికి తగినంత నీరు చేరిపోయింది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో డ్యాం పూర్తిగా నిండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డ్యాంలో నీటి నిల్వ, డ్యాంలోకి వస్తున్న ఇన్‌ఫ్లోను బట్టి ఖరీఫ్‌ పంటకు ఢోకా లేనట్టేనని తెలుస్తోంది. ఇప్పటికే తుంగభద్ర ఆయకట్టులో బోరుబావులు, చెరువుల కింద వరి నార్లు పోసుకుని రైతన్నలు సిద్ధంగా ఉన్నారు. వరినాట్లు వేయడానికి కొందరు రైతులు ముందుగానే దుక్కులు దున్నగా, మరికొందరు రైతులు తమ భూముల్లో జోరుగా ఖరీఫ్‌ పనులను ఉత్సాహంగా చేస్తున్నారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగరతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, వైఎస్‌ఆర్‌, అనంతపురం, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, గద్వాల జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20 లక్షల మేర ఆయకట్టు భూములు ఉన్నాయి. దీంతో అన్ని ప్రాంతాలకు దామాషా ప్రకారం నీటి విడుదలకు డ్యాంలో తగినంత నీరు చేరింది.

సాగునీటి విడుదలకు అధికారుల ఏర్పాట్లు

ఈనేపథ్యంలో హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ, రాయబసవణ్ణ తదితర కాలువలకు నీరు విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంచినీటి కోసం కాలువలకు నీరు వదిలిన నేపథ్యంలో అదే నీటిని నిలుపుదల చేయకుండా కాలువ ద్వారా ఖరీఫ్‌ సాగుకు నీరు కొనసాగిస్తామని అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్‌ సాగుపై ఆందోళన చెందిన రైతాంగానికి, ప్రస్తుతం డ్యాంలోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో వల్ల రైతన్నలకు పెద్ద ఊరట చెందిందని చెప్పవచ్చు. కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి సాక్షితో మాట్లాడుతూ వరుణుడి దయతో ఖరీఫ్‌కు సరిపడేంతగా డ్యాంలోకి నీరు చేరిందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నారు పోసుకున్న రైతులు సకాలంలో అదునులో వరినాట్లు వేయడానికి, మిర్చి నారు పోసుకున్న రైతులు కూడా మిర్చి నాట్లు వేసుకోడానికి వీలవుతుందన్నారు. అధికారులు తక్షణం సాగునీటి అవసరాలకు కూడా కాలువలకు నీరు వదలాలని అన్నారు.

వరద నీటితో తొణికిసలాడుతున్న తుంగభద్ర డ్యాం

ఆయకట్టులోని పంటలను పరిశీలిస్తున్న రైతు సంఘం నేతలు

డ్యాంకు లక్ష క్యూసెక్కులకు పైగా

ఎగువ నుంచి వస్తున్న వరద

తుంగభద్ర డ్యాంలో 60 టీఎంసీలకు పైగా చేరిన నీటి నిల్వ

ఆయకట్టులో ఖరీఫ్‌ పంటల సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు

సగానికి పైగా తుంగభద్ర డ్యాం భర్తీ

హొసపేటె: బళ్లారి, కొప్పళ, రాయచూరు, విజయనగర జిల్లాలతో సహా మూడు రాష్ట్రాల్లోని 8 జిల్లాలకు జీవనాడి తుంగభద్ర డ్యాంలోకి ఎగువ నుంచి వరద భారీగా పెరిగింది. ప్రస్తుతం డ్యాం సగానికి పైగా నిండటంతో జలకళ వచ్చింది. 1633 అడుగుల గరిష్ట నీటిమట్టం కలిగిన డ్యాంలో బుధవారం ఉదయం 8 గంటలకు నీటిమట్టం 1619.42 అడుగులకు చేరింది. 105.788 టీఎంసీల గరిష్ట నీటినిల్వ సామర్థ్యం కలిగిన ఈ డ్యాంలో ఇప్పటికే 59.718 టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేరింది.

తొలిసారిగా లక్ష క్యూసెక్కుల వరద

ప్రస్తుత ఏడాదిలో తొలిసారిగా డ్యాంలోకి వరద లక్ష క్యూసెక్కులను దాటింది. గత 24 గంటలుగ 1,00,750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాలువల ద్వారా 1,443 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం 1626.06 అడుగులుగా, నీటి నిల్వ 80.003 టీఎంసీలుగా ఉండేది. మల్నాడులో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వచ్చేవారంలో డ్యాం పూర్తిగా నిండుతుందనే ఆశలు చిగురించాయి. మొత్తం మీద తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుండటం రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement