సాంస్కృతిక రాజసం మైసూరు | - | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక రాజసం మైసూరు

Aug 2 2026 1:46 AM | Updated on Aug 2 2026 1:46 AM

మైసూరు: ‘ప్రాచీన సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షిస్తున్న మైసూరు, సాంస్కృతిక జీవశక్తికి కేంద్రం. ఇక్కడ ప్రతి సందులోనూ సంగీతం, సాహిత్యం, వారసత్వం పెనవేసుకుపోయాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు నగర ఘనతను కొనియాడారు. నగరంలో రామకృష్ణ ఆశ్రమంలో రూ. 45 కోట్లతో నిర్మించిన వివేక స్మారక భవనాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ.. భారతదేశపు ప్రాచీన సాంస్కృతిక కేంద్రంగా అభివర్ణించారు. స్వామి వివేకానంద మైసూరులో కొంతకాలం ఉన్నారని, ఆయనకు మైసూరు మహారాజు సహాయం చేశారని తెలిపారు. ఇక్కడి నుంచే స్వామి వివేకానంద అమెరికాలో అడుగుపెట్టారు. అమెరికాలో నిలబడి, మైసూరు తనకు ఎలా సహాయపడిందో స్వామీజీ గుర్తుచేసుకున్నారని వివరించారు. మైసూరు స్వామి వివేకానంద జీవితంలో ఒక భాగమని అన్నారు. జాతీయ కవి కువెంపు మైసూరులో స్థిరపడి సాహిత్యంలో రాణించారు, ఇంతటి పవిత్ర భూమికి వచ్చి ఇక్కడ నిలబడటం నాకు ఒక ప్రత్యేక అనుభవమని అన్నారు. ఈ నగరంలోని ప్రతి వీధిలోనూ భారతదేశ వారసత్వం ఉందని, నా జీవిత ప్రయాణంలో రామకృష్ణ ఆశ్రమం పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు. వివేక స్మారక చిహ్నాన్ని ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. శిల్పకారుడు అరుణ్‌ రూపొందించిన స్వామి వివేకానంద పాలరాతి శిల్పాన్ని స్వామీజీలు మోదీకి బహూకరించారు. వాల్మీకి రామాయణం పుస్తకాన్ని మోదీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌, స్వామీజీలు పాల్గొన్నారు. అంతకుముందు, ప్రత్యేక విమానంలో మైసూరులోని మండకల్లి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని, హెలికాప్టర్‌లో మైసూరు విశ్వవిద్యాలయం ఓవల్‌ గ్రౌండ్‌లో దిగారు. గవర్నర్‌, సీఎంలు ఘన స్వాగతం పలికారు. కారులో ఆశ్రమానికి వచ్చారు. రోడ్లకు ఇరువైపులా జనం నిలబడి జయధ్వానాలు చేశారు.

దేశమంతా కర్ణాటక వైపు: సీఎం

‘భారతదేశం పురోగమించాలంటే, కర్ణాటకతో కలిసి నడవాలి. సమాఖ్య వ్యవస్థలో మనమందరం కలిసి పనిచేద్దాం, కర్ణాటకకు సహాయం చేసేటప్పుడు విశాల హృదయంతో ఆదుకోండి’ అని సీఎం డీకే శివకుమార్‌ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ సభలో సీఎం ప్రసంగిస్తూ, ‘ప్రపంచమంతా కర్ణాటక వైపు చూస్తోంది. భారతదేశాన్ని కర్ణాటక, బెంగళూరు ద్వారానే చూస్తున్నారు. మన వాతావరణం, సంస్కృతి మన బలం. రాష్ట్రం మీకు అండగా నిలుస్తుంది. మనం తప్పక కలిసి పనిచేయాలి,‘ అని ప్రధానిని ఉద్దేశించి విన్నవించారు. మైసూరు మహారాజు బెంగళూరులో 300 ఎకరాల భూమిని ఇచ్చారు. అక్కడ జంషెడ్‌జీ టాటా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ను ప్రారంభించారని తెలిపారు. ఇది ఈ దేశ విజ్ఞాన శాస్త్రానికి మైసూరు మహారాజు చేసిన సేవ అన్నారు.

స్వామి వివేకానంద ఆదర్శాలతో మనం టీం కర్ణాటకగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో యువజనం కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి తమ సర్కారు యువజన సంఘాలను ఏర్పాటు చేస్తుందని భారత్‌ జోడో సంఘాల గురించి తెలిపారు. స్వామి వివేకానంద ఆదర్శాలు, ఆలోచనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, యువత ఆయన ఆత్మవిశ్వాసాన్ని, సేవా స్ఫూర్తిని, దేశభక్తిని తమ జీవితాల్లో అలవర్చుకోవాలని తెలిపారు.

ప్యాలెస్‌ సిటీకి ప్రధాని మోదీ ప్రశంసలు

రామకృష్ణ మఠంలో వేడుకకు హాజరు

కర్ణాటకకు చేయూతనివ్వాలని సీఎం డీకే వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement