మైసూరు: నగరంలోని హెబ్బాళలోని జేఎస్‌ఎస్ అర్బన్ హాత్‌లో గాంధీ శిల్ప బజార్ కళాకృతుల వస్తువుల ప్రదర్శన, విక్రయ మేళా జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జేఎస్‌ఎస్ మహా విద్యా పీఠం సంయుక్త ఆధ్వర్యంలో సాగుతోంది. దక్షిణ భారతంలోని వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు, చేనేతకారులు తమ నైపుణ్యంతో తయారు చేసిన చీరలు, వస్త్రాలు, అలంకారిక వస్తువుల స్టాళ్లు 50 వెలిశాయి. ఆగస్టు 3 వరకు ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది, ప్రవేశం పూర్తిగా ఉచితం.
ఉద్యోగం ఇప్పిస్తానని రూ.17 లక్షల మస్కా
మైసూరు: ప్రజా పనుల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ వ్యక్తి నుంచి రూ. 17 లక్షలను వసూలు చేశాడో వంచకుడు. మైసూరులోని వినాయకనగర నివాసి శ్రీకంఠ బాధితుడు కాగా, దొడ్డబళ్లాపుర నివాసి హేమంత్ ఆ మోసగాడు. స్నేహితుని ద్వారా శ్రీకంఠకు హేమంత్ పరిచయమయ్యాడు. అతనితో స్నేహం చేసి, తనకు పెద్ద అధికారులు తెలుసని నమ్మించాడు. ప్రజా పనుల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇందుకోసం రూ.30 లక్షలు ఇస్తే పనైపోతుందని తెలిపాడు. అతని మాటలను నమ్మిన శ్రీకంఠ అతని దశల వారీగా రూ.17 లక్షలను చెల్లించాడు. తర్వాత శ్రీకంఠ కారును కూడా నిందితుడు తీసుకెళ్లాడు. ఎన్ని రోజులైనా అతను ఉద్యోగం ఇప్పించలేదు. మోసాన్ని గ్రహించి హెబ్బాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆలయ ప్రవేశంపై రగడ
దొడ్డబళ్లాపురం: దేవాలయం లోపలకు వచ్చారనే కారణంతో దళితులపై దాడి జరిగింది, ఈ ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా బెళలగెరె గ్రామంలో వెలుగుచూసింది. శుక్రవారంనాడు గ్రామంలో అజ్జి పండగ నేపథ్యంలో తాము దేవాలయంలోకి వెళ్లామని, దీంతో తమపై గ్రామంలోని సుమారు 40 నుండి 50మంది వచ్చి తమపై దౌర్జన్యం చేశారని ముగ్గురు దళితులు బసవాపట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ హెచ్‌టీ శేఖర్ గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మద్యం తాగి దేవాలయంలోకి రావడం వల్లే తాము అడ్డుకున్నామని మరో వర్గం వారు చెప్పారు. ఇరుపుల వారికి సర్ది చెప్పిన ఎస్పీ శేఖర్, తహసీల్దార్ నాగరాజు, ఏసీ డా.చన్నప్ప తదితరులు దళితులను దేవాలయంలోకి తీసికెళ్లారు. దాడికి పాల్పడిన 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గజ దాడిలో రైతు బలి
యశవంతపుర: అడవి ఏనుగు దాడిలో రైతు మృతి చెందిన ఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా హిరేహసడె గ్రామంలో జరిగింది. కణగుప్పెవాసి ధర్మశెట్టి (55), బుధవారం సాయంత్రం పని మీద బేలూరుకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. శుక్రవారం సాయంత్రం దగ్గరలో కాఫీ తోట దగ్గర శవం కనిపించింది. బుధవారం రాత్రి నడిచి వస్తుండగా ఏనుగు దాడిచేసి తొక్కి చంపినట్లు గుర్తులున్నాయి. డీఎఫ్‌సీ, పోలీసులు పరిశీలించారు. ఏనుగుల దాడులను అడ్డుకోవడం లేదంటూ గ్రామస్తులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ప్రధాని పర్యటనలో
నిరసనకు యత్నం
మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మైసూరు పర్యటనలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన దళిత సంఘర్ష సమితి (డీఎస్‌ఎస్) నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానస గంగోత్రిలోని క్లాక్ టవర్ ఎదురుగా ఉన్న నారాయణ శాస్త్రిక్ రోడ్డులోని వివేక్ స్మారకం వరకు ర్యాలీ నిర్వహించాలని సమితి నాయకులు ప్రణాళిక వేశారు. పోలీసులు వారిని క్లాక్ టవర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు మానస గంగోత్రి వద్ద గుమిగూడి గో బ్యాక్ మోదీ అని నినాదాలు చేశారు. ఆందోళనలు చేయరాదని పోలీసులు సమితి నాయకులతో గంటకు పైగా చర్చలు జరిపారు. ర్యాలీ చేయమని, 10 నిమిషాలు నిరసన తెలుపుతామని కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.


