న్యూస్‌రీల్
ప్రేమజంటపై ముష్కరుల దాడులు
ఘనంగా మహంకాళి కరగ
బొమ్మనహళ్లి: రామనగరలోని ట్రాప్లేన్‌లోని బండి మహంకాళి దేవి ఆలయం గిండి కరగ మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధలతో జరిగింది. పూజారి హరీష్ వరుసగా తొమ్మిదో సంవత్సరం కరగను ధరించి నృత్యమాడారు. మహిళలు కరగకు హారతి ఇచ్చి, అమ్మవారికి పూజలు చేశారు. తమటే, డోలు, జానపద నృత్యాలు మరింత శోభను చేకూర్చాయి. మధ్యాహ్నం భక్తుల కోసం మాంసాహార విందు నిర్వహించారు. మేము దాదాపు 80 సంవత్సరాలుగా, ఎలాంటి కుల, మత వివక్ష లేకుండా, సామరస్యంగా ట్రాప్లేన్ ఆదిదేవత అయిన అమ్మవారి కరగను జరుపుతున్నాము అని కరగధారి హరీష్ చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు కె. శేషాద్రి శశి, గాబ్రియేల్, అస్మతుల్లా ఖాన్ తదతరులు పాల్గొన్నారు.
కొమ్మ పడి హెచ్‌ఎంకు తీవ్రగాయాలు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార సిబ్బంది నిర్లక్ష్యానికి అత్తిగుప్పె మెట్రోస్టేషన్ వద్ద చెట్టుకొమ్మ విరిగిపడి హెడ్‌మాస్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు బాలాజీ (50) రామనగరలో ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం. బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బైకులో బయలుదేరిన బాలాజీ అత్తిగుప్పె మెట్రోస్టేషన్ వద్ద బైకు నిలిపి తెలిసిన మహిళతో మాట్లాడుతూ నిలబడ్డారు. ఈ సమయంలో ఓ చెట్టు కొమ్మ విరిగిపడింది. బాలాజీ తల, వెన్నెముక కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన సోదరుడు మాట్లాడుతూ పాత స్టూడెంట్ ఎదురుపడటంతో బైకు నిలిపి మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. వెన్నెముక కింది భాగం నుంచి కాలు వరకు అచేతనంగా ఉందని వాపోయాడు. చెట్టుగురించి స్థానికులు అనేకసార్లు జీబీఏకు ఫిర్యాదు చేసినా దానిని తొలగించలేదని తెలిసింది.
కాలేజీలలో హెచ్‌ఐవీ
కేసులు అబద్ధం
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరు కాలేజీ విద్యార్థుల్లో 7 వేల హెచ్‌ఐవీ కేసులు రికార్డు అయినట్లు, హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలను తప్పనిసరి చేసినట్లు కొన్ని టీవీ చానెళ్లు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (కేఎస్‌ఏపీఎస్) ఖండించింది. అవి పూర్తిగా తప్పు అని, ఆధారరహితమని ప్రాజెక్టు డైరెక్టర్ పద్మ బసవంతప్ప తెలిపారు. 2004 నుంచి ఇప్పటివరకు 18–35 ఏళ్ల వయసు కలిగిన మొత్తం 39,028 మంది హెచ్‌ఐవీ రోగులు చికిత్స పొందారని తెలిపారు. నిబంధనల ప్రకారం బలవంతంగా హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలను చేయడం నేరమన్నారు. కాబట్టి కాలేజీలు లేదా ఏ ఇతర స్థలాల్లో కూడా పరీక్షలను తప్పనిసరి చేయలేదన్నారు.
శివాజీనగర: కరువు వల్ల కావేరీ నదీ జలాలను తమిళనాడుకు పంపిణీ చేయలేక సతమతం అవుతున్న కన్నడనాడుకు కావేరి జల నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ)లో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు 15 రోజులు నిత్యం 3,500 క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలన్న ఆదేశాన్ని రద్దు చేయాలని దాఖలు చేసిన అప్పీల్‌ను తిరస్కరించింది. కావేరీ నది నియంత్రణ మండలి (సీడబ్ల్యూఆర్‌సీ) జారీ చేసిన ఉత్తర్వులపై అప్పీల్ చేయగా, గురువారం అథారిటీ సమావేశం జరిపింది. కర్ణాటక తరపున అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్‌గుప్తా వాదిస్తూ సీడబ్ల్యూఆర్‌సీ సిఫార్సును కర్ణాటక పాటించే పరిస్థితి లేదు, వర్షాలు లేవు, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు, బిలిగుండ్లు వద్ద రోజువారీ ప్రవాహం 178 క్యూసెక్కులుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో 30,748 క్యూసెక్కులుగా ఉండేది, గతేడాది 116.92 టీఎంసీల కావేరి జలాలు తమిళనాడుకు ప్రవహించాయి, మా వద్ద కావేరీ జలాశయాలలో 36.69 టీఎంసీల నీరు మాత్రమే ఉంది, గతేడాది ఇది 99 టీఎంసీలుగా ఉండేది అని వివరించారు. ఒప్పందం ప్రకారం ఏటా 40 టీఎంసీల నీటిని విడుదలవుతాయి, ఈ ఏడాది కరువు తీవ్రత కారణంగా 3.5 టీఎంసీలు వెళ్లాయని తెలిపారు. కాబట్టి ఉత్తర్వులను సమీక్షించాలని కోరారు. కానీ అథారిటీ మాత్రం అంగీకరించకుండా నీటిని విడుదల చేయాలని స్పష్టం చేసింది.
మేకెదాటు డీపీఆర్ తిరస్కృతి
● కొత్త నివేదిక ఇవ్వాలని ఆదేశం
శివాజీనగర: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చని అంశాలు ఉన్నాయంటూ కేంద్ర జల సంఘం మేకెదాటు ప్రాజెక్టు డీపీఆర్‌ను బెంగళూరుకు వెనక్కి పంపింది. కొత్త డీపీఆర్‌ను సమర్పించాలని ఆదేశించింది. కొన్నేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం మేకెదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని సవివర నివేదిక (డీపీఆర్)ను అందజేసింది. ఈ నివేదిక కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు, 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని జల సంఘం అనుమానాలు వ్యక్తంచేసింది. బెంగళూరు నీటి అవసరాలకు 4.75 టీఎంసీలను సేకరిస్తామని నివేదికలో తెలిపారు, తరువాత దానిని 6.90 టీఎంసీలకు పెంచుతామని పేర్కొంది. దీనిపై జల సంగం అభ్యంతరం తెలిపింది. సవరించి పంపాలని చెప్పడంతో రాష్ట్ర సర్కారు నూతన నివేదికను రూపొందించాల్సి ఉంది.
ఆ అస్థిపంజరాలు పురుషులవే
తమిళనాడుకు కావేరి
నీటిని వదలాల్సిందే
సీడబ్ల్యూఎంఏ స్పష్టీకరణ
రాష్ట్ర అప్పీలుకు తిరస్కారం
పాలుపోని పరిస్థితిలో డీకే సర్కారు
2న అఖిలపక్ష భేటీ
మంత్రి రామలింగారెడ్డి
బనశంకరి: నీటి విడుదల ఆదేశాలను సీడబ్ల్యూఎంఏ సమర్థించిందని జలవనరుల మంత్రి రామలింగారెడ్డి చెప్పారు. దీనిపై ఆగష్టు 2న తేదీన బెంగళూరులో సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేసి చర్చిస్తామని తెలిపారు. ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రం తీవ్ర కరువుతో అల్లాడుతుండగా, రైతులు, కన్నడ సంఘాల్లో ఆగ్రహం నెలకొందన్నారు. విధానసౌధలో జరిగే భేటీలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా తీర్మానాలు చేస్తారు. ఇక మిగిలిన మార్గం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఒక్కటేనని సర్కారు భావిస్తోంది. నీటి విడుదలపై అశక్తత వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. 3న తమిళనాడు సీఎం విజయ్‌తో సీఎం డీకే శివకుమార్ జరిపే చర్చల గురించి అఖిల పక్షంలో ప్రస్తావించనున్నారు. బీజేపీ, జేడీఎస్ అగ్రనేతలు, రైతు, కన్నడ సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తారు. సమావేశం కోసం సౌధలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దొడ్డబళ్లాపురం: రాత్రివేళ ఊరి చివర ఏకాంతంగా ఉన్న ప్రేమికులపై దుండగులు దాడిచేసిన ఘటన దొడ్డ శివార్లలో జరిగింది. 26న అనుపమ్‌కుమార్ అనే యువకుడు ప్రియురాలితో కలిసి కే.జీ.కుంటనహళ్లి చెరువు కట్ట మీద కూర్చుని ఉండగా అక్కడకు వచ్చిన నలుగురు స్థానిక యువకులు యువతిని వేధించారు. దీంతో జంట కారులో వెళ్లిపోతుండగా దుండగులు బైక్‌లలో వెంబడించారు. కారు ఢీకొని బైక్ దెబ్బతింది, ఈ కారణంతో దుండగులు కారుని ధ్వంసం చేయడంతోపాటు యువకున్ని చితకబాదారు. అతని స్నేహితుడు అరవింద్ వచ్చి ఇద్దరినీ రక్షించి తన కంపెనీ కార్యాలయానికి తీసికెళ్లాడు. అక్కడకూ వచ్చిన సుమారు పాతికమంది వ్యక్తులు మరోసారి అనుపమ్‌కుమార్, అరవింద్‌పై దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొడ్డ గ్రామీణ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి, మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
నీరు వదలరాదు: బొమ్మై
దొడ్డబళ్లాపురం: తమిళనాడుకు నీరు వదలరాదని మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బసవరాజు బొమ్మై డిమాండు చేశారు. రాష్ట్ర జలాశయాల్లో తక్కువ నీరు ఉంది, మనకే సరిపోదని చెప్పారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అధికారులు కావేరి కమిటీల ముందు సరైన వాదనలు వినిపించలేదని సర్కారును విమర్శించారు. సీఎం డీకే శివకుమార్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని, ఆయనతో తాను మాట్లాడానని తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఎంపీలు బసవరాజ్ బొమ్మై, శెట్టర్, కారజోళ, కాగేరి, మోహన్ తదితరులు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలసి కావేరి నీటి సమస్యలపై చర్చించారు.


