చింతామణి: గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే కొందరు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. స్కాన్ చేయించి తెలుసుకుని గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ఈ కిరాతకానికి బ్రోకర్లు, కొన్ని స్కానింగ్ సెంటర్లు సహకరిస్తున్నాయి. చింతామణి పట్టణంలో ఇలాంటిదే వెలుగుచూసింది. బెంగళూరు, మండ్య తదితర ప్రాంతాల్లో గర్భిణినిలను సంప్రదించి, ఆడపిల్లో, మగపిల్లాడో స్కాన్ చేయించి చెబుతామని ఆశపెట్టి మండ్యకు చెందిన జయలక్ష్మీ అనే దళారీ చింతామణి పట్టణంలోని సుమ నర్సింగ్ హోంకు తీసుకొస్తోంది. కొంతకాలంగా ఈ దందా సాగుతోంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ కూడా చేస్తున్నారు. ఇది తెలిసి గురువారం జిల్లా ఆరోగ్య అధికారులు జయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం ఓ ఉద్యోగిని.. తాను గర్భిణి అని, ఆడపిల్ల అయితే అబార్షన్ చేయాలని ఆమెకు ఫోన్ చేసి వల వేసింది. సరేనంటూ, ఇందుకు రూ. 35 వేలు ఇవ్వాలని దళారీ తెలిపింది. వెంటనే జిల్లా ఆరోగ్యాధికారి చంద్రశేఖరెడ్డి, పోలీసులతో కలిసి నర్సింగ్‌హోంపై దాడి చేసి ఆమెను నిర్బంధించారు. డా.మునివెంకటరెడ్డి, నేత్ర అనేవారిపైనా ఫిర్యాదు చేశారు. వారిపై విచారణ చేపట్టారు.
బాగేపల్లిలో తల్లయిన బాలిక
బాగేపల్లి: బాగేపల్లిలో 4 రోజుల్లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడులు వెలుగుచూశాయి. వారిలో ఓ బాలిక గర్భవతై బిడ్డకు జన్మనిచ్చింది. పీయూసీ చదువుతున్న విద్యార్థిని కడుపునొప్పితో బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే శిశువును ప్రసవించింది. మరోవైపు, 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. రెండు ఘటనల్లోనూ నిందితులు వారికి బంధువులని తెలిసింది. రెండు కేసుల్లోనూ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బాగేపల్లి తాలూకాలో ఇలాంటి సంఘటనలు పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
చింతామణిలో అబార్షన్
ముఠా గుట్టురట్టు
బాగేపల్లిలో వరుస లైంగిక దాడులు


