పులికి దంత సర్జరీ | - | Sakshi
Sakshi News home page

పులికి దంత సర్జరీ

Jul 31 2026 2:09 AM | Updated on Jul 31 2026 2:09 AM

బొమ్మనహళ్లి: సాధారణంగా మనుషుల దంతాలకు సమస్య వస్తే రూట్‌ కెనాల్‌ చేయించుకుంటారు. పులికి సైతం దంతం పాడైపోవడంతో దానికి రూట్‌ కెనాల్‌ సర్జరీ చేశారు. బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్‌లో కొన్ని పులులు ఉన్నాయి. వీటిలో సించన అనే పులి కోర పంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతోంది. ఆ పులి బోను కడ్డీని కొరకడం వల్ల దాని కోర పన్ను దెబ్బతింది. దీనివల్ల ఇన్ఫెక్షన్‌ సోకింది. నొప్పి ఎక్కువ కావడంతో సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదు. దీని వల్ల పులి ఆరోగ్యం అంత బాగా లేదు. పులిని పరీక్షించిన పశువైద్యులు దాని పంటికి చికిత్స చేయాలని నిర్ణయించారు. మత్తు మందు ఇచ్చి 3 గంటలకు పైగా శ్రమించి రూట్‌ కెనాల్‌ చికిత్సను నిర్వహించారు.

ఎగువ సభాపతి మార్పు?

కాంగ్రెస్‌ సన్నాహాలు

శివాజీనగర: విధానపరిషత్‌ సభాపతి బసవరాజ్‌ హొరట్టిని తొలగించి తమ పార్టీ నేతను నియమించాలని అధికార కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. హొరట్టి గతంలో బీజేపీ నుంచి ఆ పదవికి ఎన్నికయ్యారు. అలాంటి వారిని తాము అంగీకరించలేమని కాంగ్రెస్‌ చెబుతోంది. అడిగితే, వెంటనే రాజీనామా చేస్తానని, కుర్చీకి అతుక్కుపోయి కూర్చోనని హొరట్టి తెలిపారు.

అసెంబ్లీ నేపథ్యంలో...

అసెంబ్లీ సమావేశాలు ఆగష్టు 13 నుంచి 27 వరకు 10 రోజుల పాటు జరుగుతాయి. ఎగువసభలో తమ మాట చెల్లుబాటు కోసం సభాపతిని మార్చాలని సీఎం సహా సీనియర్లు భావిస్తున్నారు. సీఎం డీకే శివకుమార్‌ తనకు ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారని, రాజీనామా గురించి మాట్లాడలేదని హొరట్టి చెప్పడం గమనార్హం. తాజా పరిణామాలపై హొరట్టి స్పందిస్తూ, నన్ను మార్చాలనుకుంటే, మార్చనివ్వండి. అవిఽశ్వాస తీర్మానం పెడతామంటే కారణం ఉండాలి కదా, నేనేమీ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అని చెప్పారు.

రైతు దంపతుల ఆత్మహత్య

ఒకే చెట్టుకు ఉరి

మండ్య: అప్పుల బాధ రైతు దంపతులను బలి తీసుకుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక కలిసే తనువు చాలించారు. ఈ విషాద సంఘటన మండ్య తాలూకాలోని హట్న బేవుకల్లు గ్రామంలో జరిగింది. మీసె పుట్టస్వామి (58), నాగమ్మ (55) మృతులు. వీరు 5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. సేద్యం అవసరాల కోసం అప్పులు చేశారు, తీర్చాలంటూ రుణదాతల నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీనికి తోడు అనావృష్టి కూడా బాధపెట్టింది. తమ పొలం పక్కనే ఉన్న మరొకరి పొలంలోని మర్రిచెట్టు కొమ్మలకు ఉరి వేసుకున్నారు. శివళ్లి పోలీసులు శవాలను కిందకు దించి మండ్యలోని మిమ్స్‌ మార్చురీకి తరలించారు. జిల్లాలోని రైతుల దీనావస్థను ఈ దుర్ఘటన ప్రతిబింబించింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

ప్రధానికి కానుక రెడీ

మైసూరు: మైసూరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన విచ్చేసి రామకృష్ణ ఆశ్రమంలో నిర్మించిన నూతన వివేక స్మారకం భవనాన్ని ప్రారంభిస్తారు. నగరవాసి, ప్రముఖ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ప్రధాని కోసం బహుమతిని సిద్ధం చేశారు. తెలుపు రంగు పాల రాతిలో వివేకానందుని ఏకశిలా ప్రతిమను చెక్కారు. సుమారు 1.5 అడుగుల ఎత్తు, 8.5 కేజీల బరువు ఉంది. కన్యాకుమారిలో 1970లో నిర్మించిన వివేకానంద రాక్‌ మెమోరియల్‌ మాదిరిలో ఈ విగ్రహాన్ని మలిచారు. 15 రోజుల్లో పూర్తిచేసినట్లు అరుణ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement