మెసూరు: రాత్రి ఒంటరిగా వెళ్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతిని కారులో అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మైసూరు జిల్లాలోని టి. నరసిపుర తాలూకాలోని ముగురు గ్రామం వద్ద జరిగింది. ఈ కేసులో టి.నరసిపురలో బట్టల దుకాణదారు రిహాన్ ఖాన్, హౌసింగ్ బోర్డ్‌వాసి కిషోర్ కుమార్, హెలవర హుండి గ్రామానికి చెందిన కిరణ్ అలియాస్ హుచ్చాను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు.. బెంగాల్‌కు చెందిన 30 ఏళ్ల యువతి, టి.నరసిపుర పట్టణంలో అద్దె ఇంట్లో నివసిస్తూ, ఒక చాట్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆమె 19న రాత్రి పార్టీ ఉందంటే మైసూరులో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి బస్టాండులో దిగి నడిచి వస్తుండగా, కారులో వచ్చిన నిందితులు ఆమెను ఏదో చిరునామా అడిగారు, తనకు తెలియదని చెప్పగా, బలవంతంగా ఎక్కించుకున్నారు. పలు లాడ్జిలు తిప్పుతూ చివరకు ముగురు గ్రామం సమీపంలో ఉన్న ఒక లాడ్జికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్‌తో పాటు రూ. 5 వేలు దోచుకున్నారు.
రూ.లక్ష ఇవ్వాలని బెదిరించి
రూ.లక్ష ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారని బాధితురాలు తెలిపింది. డబ్బు ఇంట్లో ఉందని, తీసుకెళ్తే ఇస్తానని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారని ఆమె పేర్కొంది. బాధితురాలు కారు దిగి వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని సహాయం కోసం కేకలు వేసింది. దీంతో నిందితులు పారిపోయారు. ఇంటి యజమాని సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల ఆధారంగా కారును సీజ్ చేసి, నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి మంగళవారం తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
బాధితురాలు బెంగాల్ వలస కూలీ
మైసూరు జిల్లాలో కిరాతకం
ముగ్గురు అరెస్టు


